జులైలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 77 లక్షల కేసులు నమోదయ్యాయి. సగటున ప్రతిరోజూ రెండున్నర లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. జులై ఒకటిన కోటి ఏడు లక్షల 73 వేల కేసులు ఉండగా.. గతనెల చివరినాటికి ఆ కేసుల సంఖ్య కోటి 80లక్షలకు పెరిగింది. అటు మరణాల సంఖ్య చూస్తే.. గతనెల ఒకటినాటికి కరోనా వల్ల 5 లక్షల 22 వేల మంది చనిపోయారు. ఒక్క జులైలోనే లక్షా 60 వేల మందివరకు మృతిచెందారు. సగటున ప్రతిరోజూ 5వేల 300 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా కోటీ 80 లక్షలకు పైబడిన కేసులు, ఏడు లక్షలకు చేరువైన మరణాలతో కొవిడ్ మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది.
కరోనా మహమ్మారి ధాటికి ఉత్తర, దక్షిణ అమెరికాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే అమెరికాలో అత్యధికంగా 48లక్షల పాజిటివ్ కేసులు నమోదుకాగా లక్షా 58వేల మంది చనిపోయారు. నిత్యం కొత్తగా 60వేల పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. లాటిన్ అమెరికాలోనూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. లాటిన్ అమెరికా దేశాల్లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2లక్షలు దాటింది. ముఖ్యంగా బ్రెజిల్, మెక్సికో దేశాల్లో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. లాటిన్ అమెరికా దేశాల్లో నమోదవుతున్న మొత్తం మరణాల్లో ఈ రెండు దేశాల్లోనే 70శాతం వరకూ ఉంటున్నాయి. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడం అక్కడి ప్రభుత్వాలకు కష్టంగా మారింది. బ్రెజిల్‌లో నిత్యం దాదాపు వెయ్యికి పైగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. వీటితోపాటు పెరూ, చీలీ, అర్జెంటీనా దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది.
జులై నెలలో రోజూ సగటున 2 లక్షలు దాటి కొత్త కేసులొచ్చాయి. ప్రపంచంలోనే అత్యధిక కేసులున్న అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యాల్లో అదే స్థాయిలో ఉద్ధృతి కొనసాగుతోంది. పెద్ద దేశాలతో పాటు, పెరూ, చిలీ లాంటి చిన్న దేశాల్నీ వైరస్ కుదిపేస్తోంది. అమెరికాలో మహమ్మారి ఉద్ధృతి ఆగడం లేదు. కేసులు, మరణాలూ ఇక్కడే ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్‌లు ఎత్తివేయడం, మాస్కులు ధరించడానికి కొందరు అమెరికన్లు ఇష్టపడకపోవడం వంటి కారణాల వల్లే పలుచోట్ల కేసులు పెరుగుతున్నాయన్న విమర్శలున్నాయి.
కేసులు, మరణాల్లోనూ రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది. 27 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 94 వేల మందికి పైగా చనిపోయారు. ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. కేసుల పరంగా కొద్ది రోజుల క్రితం వరకు మూడో స్థానంలో ఉన్న రష్యా.. భారత్‌లో కొవిడ్ ఉద్ధృతి పెరగడంతో నాలుగో స్థానానికి చేరింది. కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడ మరణాలు కొంత తక్కువగానే ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలో దాదాపు సగం కేసులు దక్షిణాఫ్రికాలోనే ఉన్నాయి. అయితే తీవ్రత ఎక్కువ ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ మరణాలు కొంత తక్కువగానే ఉన్నాయి.