టీకాపై జరిగనున్న ట్రయల్స్‌లో పాల్గొన్న వారికి రెండు టీకా డోసులు ఇస్తారని, మొదటి డోసు ఇచ్చిన తరువాత 29వ రోజున రెండో డోసు ఇస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు. తరువాత.. ఈ టీకా పనితీరు ఎలా ఉంది? దీని వలన రోగనిరోదక శక్తి ప్రేరేపితమవుతుందా? లేదా? దీని వలన ఏమైనా ప్రతికూల ప్రభావం పడుతుందా అనేది ఈ ట్రయల్స్ లో నిర్థారణ అవుతుందని తెలిపారు.
ఆక్స్‌ఫర్డ్ ఫేజ్ 1,2 ట్రయల్స్ సంబంధించిన రిపోర్టులను పరిశీలించిన తరువాత డీసీజీఐ ఈ అనుమతులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ టీకాపై బ్రిటన్‌లో ఫేజ్-2, 3 దశల పరీక్షలు జరగుతుండగా బ్రెజిల్‌లో ఫేజ్-3, దక్షిణాఫ్రికాలో ఫేజ్-1,2 పరీక్షలు జరుగుతున్నాయి. కోవిషీల్డ్ పేరుతో రాబోయే ఈ వ్యాక్సిన్‌ను ఆస్ట్రోజెనెకా అనే కంపెనీతో కలిసి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారత్‌లో ఉత్పత్తి చేయబోతోంది.
మరోవైపు వ్యాక్సిన్ తయారీలో స్పీడు పెంచింది రష్యా. గామాలేయా ఇన్‌స్టిట్యూట్ తయారుచేసిన వ్యాక్సిన్ మూడు దశల ట్రయల్స్ పూర్తయ్యాయి. ఇక మిగిలింది... వ్యాక్సిన్ తయారీకి అనుమతులు పొందడం, దాన్ని మార్కెట్‌లోకి రిలీజ్ చెయ్యడమేనని అక్కడి వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈతరుణంలో కరోనా వ్యాక్సిన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ-డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనాను అంతం చేసే అద్భుత ఆయుధాన్ని ఇప్పటికప్పుడు ఊహించలేమని వ్యాఖ్యానించింది.