రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మందుల కొరత తీవ్రంగా ఉంది. ప్రముఖ ఫార్మా కంపెనీ లుపిన్ కరోనా మందులకు సంబంధించి తాజాగా కీలక ప్రకటన చేసింది. కరోనా సోకిన వారికి చికిత్సలో భాగంగా అందిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్ ఫావిపిరవిర్ ను కోవిహాల్ట్ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్న కరోనా రోగుల కోసం ఈ మెడిసిన్ ను అందుబాటులోకి తెచ్చినట్టు సంస్థ పేర్కొంది.
లుపిన్ మన దేశంలో ఈ ట్యాబ్లెట్ ను 49 రూపాయలకు విక్రయించనున్నట్లు తెలిపింది. లుపిన్ 200 ఎంజీతో 10 ట్యాబ్లెట్ల స్ట్రిప్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. అత్యవసర ఉపయోగం కోసం ఫావిపిరవిర్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందిందని సంస్థ తెలిపింది. సిప్లా లిమిటెడ్, సన్ ఫార్మా, హెటెరో ల్యాబ్స్ ఇప్పటికే ఫావిపిరవిర్ ను అందుబాటులోకి తెచ్చాయి.
మరోవైపు సన్ ఫార్మా నిన్న ఫావిపిరవిర్ సొంత వెర్షన్‌ను రూ.35 లకే విడుదల చేసింది. మన దేశంలో ఇప్పటివరకు కరోనాకు అత్యంత చౌకైన డ్రగ్ ఇదే కావడం గమనార్హం. సన్ ఫార్మా కూడా ఫావిపిరవిర్ జెనరిక్ వెర్షన్‌గా ‘ఫ్లూగార్డ్’ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.లుపిన్ సంస్థ నేడు కోవిహాల్ట్ పేరుతో డ్రగ్ ను ప్రకటించడంతో మధ్యాహ్నం 12:35 గంటలకు లుపిన్ షేర్లు స్వల్పంగా పెరిగాయి.