చైనా సిటీ షెంజన్ ప్రభుత్వం బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న చికెన్‌లో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించింది. సాధారణ చెకప్ లో భాగంగా వైద్యులు నిర్వహించిన పరీక్షలో ఈ విషయం వెల్లడైంది. ఫిబ్రవరి నెల నుంచి చైనాలో కరోనా తగ్గుముఖం పట్టగా గత కొన్ని రోజుల నుంచి భారీ సంఖ్యలో చైనాలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం అధికారులు షెంజన్‌లోని ప్రఖ్యాత షింఫడీ సీఫుడ్ మార్కెట్‌లో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించారు.
అప్పటినుంచి స్థానిక వైద్యాధికారులు ఈ మార్కెట్ తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్నవాళ్లందరికీ పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న కోడి రెక్కల్లో అధికారులు కరోనా వైరస్ ను గుర్తించారు. దీంతో అధికారులు మార్కెట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేస్తున్నారు. అయితే పరీక్షల్లో చాలామందికి కరోనా నెగిటివ్ నిర్ధారణ అయింది.
అయితే కోడి రెక్కలకు కరోనా నిర్ధారణ కావడం గురించి చైనాలో ఉన్న బ్రెజిల్ ఎంబసీ స్పందించాల్సి ఉంది. మరోవైపు ఈక్వెడార్ నుంచి దిగుమతి చేసుకున్న సీఫుడ్ ప్యాకేజీల్లో కరోనా ఉన్నట్లు చైనా ప్రభుత్వం గుర్తించింది. గతేడాది చైనాలోని వుహాన్ నగరంలో తొలిసారిగా చైనాలో వుహాన్ నగరంలో కరోనా మహమ్మారి ఆనవాళ్లు బయటపడ్డాయి. చైనా నుంచి ఇతర దేశాలకు వ్యాప్తి చెందిన వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తూనే ఉంది. అమెరికా, బ్రెజిల్ దేశాల్లో కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు కరోనా, లాక్ డౌన్ వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్నాయి.