ప్రైవేట్ ఆస్పత్రుల మీద అందే ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జీవోలు ఉల్లంఘించే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. ఢిల్లీ తరహాలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలకు పడకలు కేటాయించాలన్న న్యాయస్థానం... ఒకవేళ ప్రభుత్వానికి వీలు కాకపోతే కారణాలు తెలపాలని కోరింది.

తెలంగాణలో కరోనా పరీక్షలు, చికిత్సలపై హైకోర్టులో జరిగిన విచారణకు.. సీఎస్ సోమేష్‌ కుమార్‌, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. కరోనా పరీక్షలు, చికిత్సలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈనెల 3 నుంచి సుమారు 42వేల మంది సెకండరీ కాంటాక్టులకు కరోనా పరీక్షలు నిర్వహించామని నివేదికలో తెలిపింది.


 హోటళ్లలో ఐసోలేషన్‌ పడకలు 857 నుంచి 2,995కి పెరిగాయని వెల్లడించింది. ప్రైవేటు ఆసుపత్రులపై 50 ఫిర్యాదులు వచ్చాయని.. 46 ఆసుపత్రులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చామని..వాటికి 16 ఆసుపత్రులు వివరణ ఇచ్చాయని తెలిపారు. బులిటెన్‌లో గందరగోళం లేకుండా చర్యలు తీసుకున్నామని..తెలుగులోనూ బులిటెన్ ఇచ్చామని సీఎస్ స్పష్టంచేశారు.

రాష్ట్రంలో రోజుకు 40వేల ర్యాపిడ్‌ టెస్టులు జరిపేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీలో కరోనా తగ్గుముఖం పడుతోందని వివరించారు. సోమేష్ కుమార్‌ వివరణపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.


ప్రైవేట్ ఆస్పత్రులు పేదలకు ఉచితంగా వైద్యం చేశాయో లేదో పరిశీలించాలని ఆదేశించింది. ఒకవేళ పేదలకు ఉచిత వైద్యం అందించకపోతే లోపమెక్కడో పరిశీలించాలని హైకోర్టు సూచించింది. సీఎస్ నేతృత్వంలో ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేయాలని, ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటుపై ఎన్‌జీవోలు ముందుకొస్తే పరిశీలించాలని పేర్కొంది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 4కు వాయిదా వేసింది.

మొత్తానికి ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై కఠిన చర్యలు   తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. చూద్దాం ప్రైవేట్ ఆస్పత్రుల తీరులో ఏమైనా మార్పు వస్తుందేమో..!




మరింత సమాచారం తెలుసుకోండి: