నిపుణులు కరోనా లక్షణాలను బట్టి ఆహారం తీసుకుంటే త్వరగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. జ్వరం ఉంటే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే కొబ్బరినీళ్లు, నీళ్లు, పండ్ల రసాలు, మిల్క్ షేక్ లు తీసుకోవాలి. తరచూ విరేచనాలు అవుతుంటే పొంగలి, ఇడ్లీ, ఉప్మా, పెరుగన్నం తీసుకుంటే మంచిది. తగినన్ని నీళ్లు తీసుకుంటూ ఓ.ఆర్.ఎస్ ద్రావణం తాగితే నీరసం రాకుండా ఉంటుంది.
చాలా మంది కరోనా బాధితులు రుచి, వాసనను గ్రహించే శక్తిని కోల్పోతున్నారు. రుచి, వాసనలను గుర్తించలేని వాళ్లు మసాలాతో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినలేరు. అందువల్ల వీళ్లు కిచిడీ, టమాటా బాత్, పొంగలి, చారు, రసం, వెజిటేబుల్ ఫులావ్, ఎగ్ ఫ్రైడ్ రైస్ లాంటివి తీసుకోవాలి. కరోనా రోగులు దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహంతో బాధ పడుతుంటే చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆహారాన్ని తీసుకోవాలి.
వైరస్ బారిన పడిన వాళ్లు నిల్వ చేసిన ఆహారపదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. చిప్స్, స్వీట్లకు వీలైనంత దూరంగా ఉండాలి. రోజూ ఉదయం సమయంలో గుడ్లు, పండ్లు తీసుకుంటే మంచిది. మాంసాహారులైతే మధ్యాహ్న సమయంలో చికెన్ తీసుకుంటే మంచిది. శాఖాహారులు మాత్రం ఉడకబెట్టిన వేరుశనగలు, పెరుగు, పన్నీర్, సోయా నగ్గెట్స్ తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, కాయగూరలను వినియోగిస్తే మరీ మంచిది. సరైన ఆహారం తీసుకోవడం వల్ల వైరస్ బారిన పడినా త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయి. కరోనా రోగులు తగిన ఆహార నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.