అయితే ఇదే సమయంలో కొందరు నాయకులు కరోనా తగ్గుతుందని చెబుతూ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా రాజస్థాన్‌కి చెందిన బీజేపీ ఎంపీ సుఖ్‌బీర్ సింగ్ జౌనపూరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఒంటికి బురద రాసుకుని, శంఖం ఊదితే నోవెల్ కరోనా వైరస్ పరారైపోతుందని ఆయన చెప్పారు. తద్వారా మన శరీరం కొవిడ్-19 పై సమర్థంగా పోరాడగలదని చెప్పుకొచ్చారు.
ఈ ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. యోగా డే సందర్భంగా సుఖ్‌బీర్ ఒంటికి బురద రాసుకుని యోగా చేస్తే ఎలాంటి జబ్బులైనా మటుమాయం అయిపోతాయని వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. గతంలో కేంద్ర మంత్రి అర్జున్ ముండా భాభీజీ అప్పడాల్లో రోగ నిరోధక శక్తిని పెంచే పదార్థాలు ఉన్నాయని... ఆ అప్పడాలను తింటే వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చని అన్నారు.
అయితే తాజాగా ఆయనా కరోనా బారిన పడ్డారు. ఒకవైపు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కోసం, ఔషధాల కోసం పరిశోధనలు చేస్తుంటే సొంత వైద్యాలు, వింత విధానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఈ సొంత వైద్యాల వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తూ వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న సమయంలో ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై పార్టీలు కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.