అలలు 3.5 నుంచి 4.3 మీటర్ల ఎత్తున ఎగిసిపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచనలు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వాతావరణ శాఖ రేపు విశాఖ, తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటన చేసింది.
సోమవారం రోజున విశాఖ, విజయనగరం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం రోజు కూడా : శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మంగళవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇప్పటికే మూడు రోజుల నుంచి వర్షాల వల్ల తడిసి ముద్దయిన ఏపీ ప్రజలకు మరో మూడు రోజుల పాటు వర్షాలు తప్పేట్లు లేవు. ఉత్తర కోస్తా ఒరిస్సా, వాయువ్య బంగాళాఖాతం, గ్యాంగ్ టెక్ పశ్చిమబెంగాల్ పరిసరాల్లో ఉన్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారటంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 19న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.