గోదారమ్మ ఉగ్రరూపం దాల్చడంతో దేవీపట్నం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రవాహం ఉద్ధృతంగా పెరగడంతో ఊళ్లను ముంచేసింది. పోశమ్మగండి నుంచి దండంగి, దేవీపట్నం నుంచి చినరమణయ్యపేట వైపునకు రహదారులపై వరద నీరు తగ్గకపోవడంతో 36 గ్రామాలకు నేటికీ రాకపోకలు లేవు. ఇళ్లను పూర్తిచేసి, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, ఇంటి నష్టపరిహారం, భూ నష్టపరిహారం చెల్లించి ఉంటే తమకు ఈ కష్టాలు తప్పేవని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోశమ్మగండి వద్ద వరద ఉగ్రరూపం దాల్చుతోంది. విద్యుత్తు సరఫరా నిలిచిందనీ..జనరేటర్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. కచ్చులూరు పరిసర గ్రామాల బాధితులు కొండలపైనుంచి వెలగపల్లి చేరుకుని.. ఇక్కడి నుంచి రంపచోడవరం వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకుంటున్నారు.
గోదావరి ఎగువ ప్రాంతాలోని భద్రాచలం వద్ద వరదనీటి మట్టం తగ్గడంతో రెండు మూడు రోజుల్లో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వరద తగ్గుముఖం పడుతుందని బాధితులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం దగ్గర గోదావరి మూడో ప్రమాదకర హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి 18.3 అడుగుల్లో ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
నాగార్జున సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. సాగర్ జలాశయానికి ఎగువ నుంచి భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో, 18 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా...ప్రస్తుతం 588 అడుగులకు చేరింది. సాగర్ గేట్లు ఎత్తడంతో.. పులిచింతల ప్రాజెక్ట్ కూడా నిండింది. పులిచింతల ప్రాజెక్ట్ ను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. కృష్ణా పరివాహక ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటిని దిగువకు విడుదల చేయాలని అధికారులకు చెప్పారు. ముంపు ప్రాంతాల వారు ఇబ్బందులకు గురికాకుండా నీటిని విడుదల చేయాలని కలెక్టర్ సూచించారు. నాగార్జునసాగర్ నుండి ఈరాత్రికి 4లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉన్నందున, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
అటు ప్రకాశం బ్యారేజీ దగ్గర క్రమంగా ప్రవాహం పెరుగుతుండటంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అలర్ట్ చేశారు. ముంపు ముప్పు ఎదుర్కొంటున్న గ్రామాల్లో ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు.