ఏపీ అధికార పార్టీ వైసీపీలోనూ ఇదే తంతు ఇప్పుడు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఇతర పార్టీ నుంచి నాయకులు వైసీపీ కండువా కప్పుకుంటుండగా, కొంతమంది ఎమ్మెల్యేలు టిడిపికి రాజీనామా చేసి, వైసీపీలో చేరి ఆ పార్టీతో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. వీరికి జగన్ సైతం అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో, మొదటి నుంచి పార్టీలో ఉన్న నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తాజాగా నిన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం వర్గీయులకు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులకు మద్య ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ, పార్టీ పరువును బజారుకి ఎక్కించారు.
ఇదిలా ఉంటే కృష్ణాజిల్లా గన్నవరంలోనూ ఇదే తరహ రచ్చ జరిగింది. టిడిపి కి రాజీనామా చేసి వైసీపీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు, అదే నియోజకవర్గంలో ఉన్న వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన దుట్టా రామచంద్రరావుకు మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసే విషయమై రామచంద్రరావు, వంశీ మధ్య వివాదం చెలరేగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు రాకముందు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేయడం పై వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై తాను వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడినని, అసలు వంశీని జగన్ కు పరిచయం చేసింది తాను అంటూ, ప్రతి విమర్శలు చేయడం, మొత్తంగా గన్నవరం నియోజకవర్గంలో ఆధిపత్యపోరు ఏవిధంగా ఉందనే విషయం మరోసారి బహిర్గతమైంది. చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉండటం, ఇతర పార్టీల నుంచి వైసీపీలో చేరిన వారితో పార్టీ అధిష్టానానికి తలనొప్పులు రావడం సర్వ సాధారణంగా మారిపోయాయి.