జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలు అనుచరించాలి ? ఏవిధంగా ముందుకు వెళ్లాలనే విషయంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలోనే పార్టీ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, నిరంజన్ మధ్య వివాదం మొదలైంది. అసలు పిసిసి ఏం చెబుతుందో వినాలంటూ దాసోజు శ్రవణ్ కు నిరంజన్ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటూ దాసోజు శ్రవణ్ నిరంజన్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ తర్వాత ఇద్దరి నేతల మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చడం, ఒకరిపై ఒకరు అసభ్య పదజాలంతో తిట్టుకోవడం, తరువాత కొట్టుకునే వరకు వెళ్లడంతో సమావేశానికి హాజరైన నాయకులంతా విస్తుపోయారు.
ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు నానా తంటాలు పడ్డారు. నాయకుల వ్యవహార శైలిపై సమావేశానికి హాజరైన వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలిసికట్టుగా పార్టీని విజయంవైపు నడిపించాల్సిన సమయంలో, ఒకరిపై ఒకరు ఇలా విమర్శలు చేసుకుని పార్టీని ప్రజల్లో మరింత చులకన చేయడం తగునా అంటూ సూచించారు. సొంత పార్టీలోనే ఇలా గ్రూపు రాజకీయాలు పెరిగిపోతుండడంతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. కాంగ్రెస్ లోని లుకలుకలే టీఆర్ఎస్, బీజేపీకి వరంగా మారాయి.