కరోనా కల్లోలం వేళ.. కిమ్‌, ట్రంప్‌ ద్వయం మరోసారి వార్తల్లో నిలిచింది. ఉత్తర కొరియా అంటే అగ్రరాజ్యం అమెరికాతో సహా ప్రపంచదేశాలన్నింటికీ హడలే. ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఒకప్పుడు రోజుకో కొత్త ఆయుధ పరీక్షతో అన్ని దేశాలకూ కంటి మీద కునుకు లేకుండా చేశారు. అయితే, ఎప్పటికీ కలవబోరనుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, నార్త్‌కొరియా ప్రెసిడెంట్‌ కిమ్‌ మధ్య 2018లో సింగపూర్‌ వేదికగా భేటీ జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్‌కు కిమ్‌ చాలా విషయాలే చెప్పారట. అమెరికాలో ప్రముఖ జర్నలిస్ట్‌ ఉడ్‌వర్డ్స్‌ తో కొన్నాళ్ల క్రితం జరిపిన ఇంటర్వ్యూలో ఆ విషయాలన్నీ వెల్లడించారట ట్రంప్‌. వుడ్ వర్డ్స్‌ రేజ్ పేరిట ఆ జర్నలిస్ట్‌ విడుదల చేసిన పుస్తకంలోని ఈ విషయాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.

2018లో మొదటిసారి కిమ్‌ను కలిసినప్పుడు ట్రంప్‌ చాలా ఆశ్చర్యపోయారట. ఉత్తర కొరియా అధ్యక్షుడిగా తాను ఎదిగిన తీరును వెల్లడిస్తూ, తన అంకుల్‌ను ఏవిధంగా అడ్డు తొలగించుకున్నాననే విషయాన్ని కూడా కిమ్‌.. ట్రంప్‌తో షేర్‌ చేసుకున్నట్టు వుడ్వర్డ్స్‌ రేజ్‌ పుస్తకంలో పేర్కొన్నారు. ప్రధానంగా అణ్వాయుధాల విషయమై కిమ్‌, ట్రంప్‌ల మధ్య చర్చ జరిగింది. అయితే అణ్వాయుధాలను విడిచి పెట్టేందుకు ఉత్తరకొరియా సుముఖంగా లేదని సమావేశానికి ముందే నిఘా వర్గాలు ట్రంప్‌కు సమాచారం ఇచ్చాయనీ.. ప్యాంగ్యాంగ్‌ను ఎలా సమన్వయం చేయాలో సీఐఏకు అవగాహన లేదని ట్రంప్‌ అన్నారని  పుస్తకంలో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఇరువురి మధ్య జరిగిన మూడు సమావేశాల్లోనూ భారీ ఒప్పందాలు కుదరలేదన్న విమర్శలను ట్రంప్‌ ఖండించారు.

అమెరికా- ఉత్తర కొరియా మధ్య 2017లో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయం గురించి ట్రంప్‌ను ప్రశ్నించగా.. ఆసక్తికర విషయాన్ని బయట పెట్టినట్టు వుడ్‌ తన పుస్తకంలో చెప్పారు. తాము ఓ అణ్వాయుధాన్ని తయారు చేశామని, ఇంతకుముందు ప్రపంచంలో ఇలాంటి ఆయుధాన్ని ఎవరూ రూపొందించలేదని ట్రంప్ చెప్పారట. రష్యా, చైనా దేశాధ్యక్షులు పుతిన్‌, జిన్‌పింగ్‌ సైతం ఇలాంటి ఆయుధం గురించి విని ఉండొకపోవచ్చని తెలిపారట. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఆయుధం నిజమేనని తేలిందని వుడ్‌ తన పుస్తకంలో చెప్పుకొచ్చారు. అయితే, దీన్ని ట్రంప్‌ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓ బ్రెయిన్‌ ఖండించారు.

మరోవైపు నల్లజాతీయులపై ఏళ్లుగా వివక్ష, అసమానతలు కొనసాగుతున్నాయని ట్రంప్‌ను ప్రశ్నించగా.. కరోనాకు ముందు నల్లజాతీయుల నిరుద్యోగిత రేటు తగ్గిందని, ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో జాత్యంహకారం తక్కువేనని ట్రంప్‌ బదులిచ్చినట్టు తన పుస్తకంలో వెల్లడించారు వుడ్‌వర్డ్స్.


మరింత సమాచారం తెలుసుకోండి: