తెలంగాణ ప్రభుత్వం మరోసారి లే ఔట్ రెగ్యులరైజేషన్ పథకాన్ని ప్రకటించడంతో... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అయినా ఇంకా ఈ పథకంపై ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. ఎవరు దరఖాస్తు చేసుకోవాలి? అసలు దరఖాస్తు చేసుకోకపోతే వచ్చే నష్టం ఏమిటి? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల ఈ స్కీమ్‌కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం.. ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీ స్పందన వస్తోందని చెబుతోంది.

అక్రమ లే ఔట్స్, అనుమతి లేని ప్లాట్స్ క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వం మరో సారి అవకాశం ఇచ్చింది. లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్‌ను ప్రకటించింది. ఈ లే అవుట్లు అన్నింటినీ క్రమబద్ధీకరించడం ద్వారా ప్రణాళిక బద్ధమైన సుస్థిర అభివృద్ధిని కోరుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది . అనధికార అక్రమ లే అవుట్‌ల కారణంగా వాటి పరిధిలో మౌలిక సదుపాయాలను కల్పించడం కష్టమవుతోందని, ప్లాట్ల యజమానులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వీటి ఫలితంగా సుస్థిర ప్రణాళికాభివృద్ధి జరిగిన ప్రాంతాలు కూడా ప్రభావితమవుతున్నాయని పేర్కొంది. అలాంటి లే అవుట్స్‌కి, ప్లాట్స్‌ రెగ్యులరైజ్‌కి ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. ప్రస్తుతమిచ్చిన గడువులోగా క్రమబద్ధీకరణ చేసుకోక పోతే తాగు నీటి కనెక్షన్‌ ఇవ్వబోమనీ... డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయబోమనీ హెచ్చరించింది. భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వబోమనీ.. ఎల్ ఆర్ ఎస్ చేయని ప్లాట్లు, లే అవుట్లు రిజిస్ట్రేషన్ చేయబోమనీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఒక్క సారి ఈ ఇష్యూను పూర్తి స్థాయిలో సెటిల్ చేస్తే మళ్ళీ మళ్ళీ సమస్యలు రాకుండా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీ లు గ్రామ పంచాయతీ లలో ఈ స్కీమ్‌ను  అమలు చేస్తోంది. అక్టోబర్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 26 లోపు చేసిన అక్రమ లే అవుట్ లకు, సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్ ఓనర్లకు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించింది. అయితే దీనికి కొన్ని నిబంధనలు పెట్టింది. రెగ్యులరైజ్ చేసుకోవాలనుకునే స్థలం నాలాలకు 2 మీటర్ల దూరం ఉండాలి. వాగుకు 9 మీటర్ల దూరంలో ఉండాలి. 10 హెక్టార్లలోపు ఉన్న చెరువుకు 9 మీటర్ల దూరం ఉండాలి . 10 హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణం లో ఉన్న చెరువుకు 30 మీటర్ల దూరంలో ఉండాలి. ఇక 111 జీఓ పరిధిలో ఉన్న స్థలాలకు అనుమతి లేదు.

ఇండస్ట్రియల్, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ లలో రెగ్యులరైజేషన్‌ ఉండదు..ఎండోమెంట్, సీలింగ్ సర్ప్స్, ప్రభుత్వ , శికం, వక్ఫ్ భూముల్లోని ప్లాట్స్, లే ఔట్స్  రెగ్యులరైజ్ చేయరు. లే ఔట్ లలో ఓపెన్ స్పేస్ కోసం వదిలిన వాటికి రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం లేదు. అయితే, తాము ఎప్పుడో స్థలం కొనుక్కున్నామనీ.. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఎందుకు కట్టాలని ప్రశ్నిస్తున్నవాళ్లూ ఉన్నారు. అయితే, స్థలం ఎప్పుడు కొన్నా అది అప్రూవ్డ్ లే ఔట్ కాక పోతే ఎల్ఆర్ఎస్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తోంది సర్కార్‌. ఒకవేళ, కట్టిన ఇళ్లయినా సరే, పర్మీషన్ లేక పోతే.. అది అప్రూవ్డ్‌ లే ఔట్ కాకపోతే ఎల్ఆర్ఎస్  తీసుకోవాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: