జాతీయ నూతన విద్యా విధానం–2020పై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్షించారు. ఆ విధానంలో ప్రతిపాదించిన అనేక అంశాలను ఇప్పటికే రాష్ట్రంలో అమలు చేస్తున్నామని సమావేశంలో వివరించిన విద్యా శాఖ అధికారులు.

ఇవీ ఆ అంశాలు:
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడం, అంగన్వాడీ కేంద్రాల్లోనూ మౌలిక సదుపాయాలు కల్పన, పక్కాగా బడి పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం అమలు, ప్రాధమిక స్ధాయిలో పాఠశాల సంసిద్ధత కార్యక్రమాలు అమలు చేయడం, ద్విభాషా పాఠ్యపుస్తకాలు రూపొందించడం, సెమిస్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టడం, వీలైనంత వరకు స్థానిక సంస్కృతికి అద్దం పట్టేలా పాఠ్య పుస్తకాల రూపకల్పన, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఏడాదికి కనీసం 50 గంటల పాటు శిక్షణా కార్యక్రమాలు అమలు జరిగేలా చూడటం వంటివన్నీ రాష్ట్రంలో అమలు అవుతున్నాయని అధికారులు తెలిపారు.

విద్యాలయాలు–వివరాలు:
    రాష్ట్రంలో సామాజికంగా, ఆర్ధికంగానూ వెనకబడ్డ వర్గాల వారి విద్యాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్న అధికారులు, ఆ మేరకు విద్యాలయాల వివరాలు వెల్లడించారు.
    ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం 1261 గురుకుల పాఠశాలలు, బాలికల కోసం 352 కస్తూరిబా గాంధీ విద్యాలయాలు (కేజీబీవీ), దివ్యాంగుల కోసం 672 భవితా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు విద్యా శాఖ అధికారులు సమావేశంలో వివరించారు.

నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌:
    నూతన విద్యా విధానంలో భాగంగా రాష్ట్ర స్ధాయిలో పాఠశాలల ప్రమాణాలను పరిరక్షించడానికి ఒక సంస్ధను ఏర్పాటు చేయాలని కోరారని, అయితే ఇప్పటికే రాష్ట్రంలో పాఠశాల విద్య, ఉన్నత విద్యకు సంబంధించి రెండు వేర్వేరు కమిషన్లు పని చేస్తున్నాయని అధికారులు తెలిపారు.

అంగన్‌వాడీలు–సిబ్బంది:
    అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న వారిలో మరింత నైపుణ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని కూడా జాతీయ నూతన విద్యా విధానంలో ప్రతిపాదించారు. అందుకు అనుగుణంగా ఎన్‌సీఈఆర్‌టీ కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది.
     ఆ మేరకు అంగన్‌వాడీ కేంద్రాలలో పని చేస్తున్న వారిలో ఇంటర్మీడియట్‌ అర్హత ఉన్న వారికి ఆరు నెలల డిప్లొమా సర్టిఫికెట్‌ కోర్సు, పదవ తరగతి అర్హత ఉన్న వారికి ఏడాది డిప్లొమా కోర్సు ప్రవేశపెట్టాల్సి ఉందని అధికారులు వివరించారు.

సూత్రప్రాయ ఆమోదం:
    జాతీయ నూతన విద్యా విధానంలో ప్రతిపాదించిన 5 ప్లస్‌ 3 ప్లస్‌ 3 ప్లస్‌ 4 అమలుకు ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది.

వచ్చే విద్యా సంవత్సరం నుంచే..:
    పిల్లల 1, 2 తరగతులకు ముందు మొదటి తరగతిలో సంసిద్ధతా తరగతిని అభ్యసిస్తే వారి పునాది ధృడంగా ఉంటుందని, ఆ మేరకు తగిన విధంగా ప్రణాళికను రూపొందించాలని సమీక్షలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశించారు.
    జాతీయ నూతన విద్యా విధానాన్ని 2021–22 నుంచే అమలు చేయాలన్న సీఎం, అందుకు తగిన విధంగా పాఠ్య పుస్తకాల ముద్రించడంతో పాటు, ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు రూపొందించాలని నిర్దేశించారు.

ఎస్‌ఓపీ–యాప్‌:
    గ్రామ, వార్డు సచివాలయాల సేవలను కూడా విద్యా రంగంలో  వినియోగించుకునేందుకు అవసరమైన విధి, విధానాలను రూపొందించాలన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, అందుకు తగిన ఎస్‌ఓపీ ఉండాలని, అదే విధంగా అవసరమైన యాప్‌ కూడా రూపొందించాలని ఆదేశించారు.

ప్రమాణాలు:
అన్ని విద్యాలయాలు, కళాశాలలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని, అవి కనీస ప్రమాణాలు పాటిస్తున్నాయో? లేదో? ధృవపర్చుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. తగిన ప్రమాణాలు పాటించని విద్యా సంస్థలను తక్షణమే మూసివేయాలని, అవి తిరిగి ఆయా ప్రమాణాలు సాధించిన తర్వాతే వాటి ప్రారంభానికి అనుమతి ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
    అదే విధంగా ఉపాధ్యాయ శిక్షణా సంస్ధల పని తీరు, ఉపాధ్యాయ శిక్షణ కరిక్యులమ్‌పై కూడా తగిన శ్రద్ధ కనపర్చాలని, సక్రమంగా పని చేయని ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు, నాణ్యమైన ప్రమాణాలు పాటించని వాటిని కూడా తక్షణమే మూసి వేయాలని నిర్దేశించారు.
    
అవగాహన కల్పించండి:
వివిధ పాఠశాలలు, శిక్షణా సంస్దలు, కాలజీలు ప్రమాణాలు పాటించాల్సిన ఆవశ్యకతపై తల్లిదండ్రులుకు వివరించాలని, విద్యా సంస్ధల్లో ప్రమాణాలు కొరవడితే నష్టపోయేది విద్యార్ధులేనని వారికి అవగాహన కల్పించాలని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సూచించారు.

ఉపాధ్యాయుల బదిలీలు:
విద్యార్ధులు, ఉపాధ్యాయులు నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను పునర్నియమించే విధంగా అవసరసమైన బదిలీలు (రీ అపోర్షన్‌మెంట్‌) చేయాలని సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశించారు.

ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని, ఉన్నత విద్యా శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర, పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుడితి రాజశేఖర్, విద్యా శాఖ కమిషనర్‌ వాడ్రేవు చిన వీరభద్రుడు, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య, సర్వశిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి,ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డితో పాటు, విద్యా శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: