ఆంధ్రప్రదేశ్ లోని కోవిడ్ ఆసుపత్రులను ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా... డిమాండ్‌కు తగినట్లు ప్రాణవాయువు సరఫరా చేయడం క్లిష్టంగా తయారయింది. వెంటిలేటర్, ఆక్సిజనేటెడ్ బెడ్స్ అందుబాటులో ఉన్నా... రోగుల ప్రాణాలను నిలబెట్టడం సవాలుగా మారింది. కోవిడ్ వైరస్ ఊపిరితిత్తులపై దాడి చేసి... శరీరంలో ఆక్సిజన్‌ స్థాయిని తగ్గించి మెదడు, గుండె పనిచేయనీయకుండా ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేస్తుంది. ఇలాంటి సమయంలో అత్యవసరంగా అందాల్సింది ఆక్సిజనే. కానీ ఇప్పుడు ఈ ప్రాణవాయువు సరఫరా డిమాండ్‌కు తగినట్లుగా లేకపోవడంతో... రోగులు నానా అవస్ధలు పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. డిశ్చార్జ్ రేట్‌ ఊరట కలిగిస్తున్నా... కోవిడ్ మరణాలు మాత్రం అదుపులోకి రావడం లేదు. ఇప్పటిదాకా సంభవించిన కరోనా మరణాల్లో 80 శాతం సకాలంలో ఆక్సిజన్‌ అందికపోవడం వల్లే అనే వాదన బలంగా ఉంది. పెరుగుతున్న రోగులకు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రాణవాయువు వినియోగం బాగా పెరిగింది. వెంటిలేటర్లు, ఆక్సిజనేటెడ్ బెడ్లకు డిమాండ్ పెరగడంతో ఇప్పుడు దాదాపు అన్ని ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. గతంలో రోజుకు వెయ్యి కిలోలు ఆక్సిజన్‌ ఉపయోగించిన ఆస్పత్రులు... ఇప్పుడు రోజుకు నాలుగు వేల కిలోల ఆక్సిజన్‌ను వాడుతున్నాయి.

రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఆక్సిజన్‌ డిమాండ్ అధికంగా ఉండగా... సరఫరా మాత్రం తగినంతగా లేదు. సాధారణ రోజుల్లో అయితే తమిళనాడు సహా పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఆక్సిజన్ సరఫరా అయ్యేది. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లోనూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడం, అవసరాలు అధికమవ్వడంతో... ఏపీకి ఆక్సిజన్‌ సరఫరా తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది.

ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్‌ నుంచి 90 టన్నుల ద్రవ ఆక్సిజన్ సరఫరా జరుగుతోంది. పెరిగిన అవసరాలకు అనుగుణంగా 200 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసి పంపిణీ చేయాలని ఆర్ఐఎన్ఎల్ ను జిల్లా యంత్రాంగం ఆదేశించింది. రోగులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఉక్కు కర్మాగారం ముందుకు వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: