సరిహద్దుల్లో ఉన్న ఎత్తైన ప్రాంతాల్లో భారత సైనికులు పాగావేయడంతో ఏకాగ్రతను దెబ్బతీయడానికి లౌడ్ స్పీకర్లలో పంజాబీ పాటలు వినిపించడమే కాదు, హిందీలో హెచ్చరికలు జారీ చేసింది... అయితే, మన సైనికులు సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారు’ అని ఓ ఆర్మీ అధికారి తెలిపారు. సీపీఎల్ఏ మన దళాలలో అసంతృప్తిని కలిగించడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఇలాంటి మానసిక కార్యకలాపాలు మన కఠినమైన యుద్ధ సైనికులను ఇబ్బంది పెట్టవు’ అని వ్యాఖ్యానించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడే చైనా.. ప్రస్తుతం అదే విధానాన్ని అవలంభిస్తోంది. ఆగస్టు 29, 30లో వార్నింగ్ షాట్ ఫైరింగ్‌కు పాల్పడిన తరువాత, కొన్ని వ్యూహాత్మక ప్రాంతాలను భారత జవాన్లు స్వాధీనం చేసుకోవడంతో లౌడ్ స్పీకర్లతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చైనా ప్రారంభించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చైనా సైనికుల తాజా చర్యను ఆర్ట్ ఆఫ్ వార్‌గా అభివర్ణిస్తున్నారు. ప్రత్యర్థిని మానసికంగా దెబ్బకొట్టి, అశాంతికి గురి చేయడానికి ఇలా చిట్కాలను ప్రయోగిస్తుందని పేర్కొంటున్నారు. చైనా మిలటరీ వ్యూహకర్త సన్ ట్జు ఆరో శతాబ్దంలో రాసిన ఆర్ట్ ఆఫ్ వార్ పుస్తకంలోని ట్రిక్‌ను ప్రస్తుతం ఉపయోగిస్తోందని అంటున్నారు. ఆయుధాలతో యుద్ధం చేయకుండా శత్రువులపై మానసికంగా పైచేయి సాధించే ప్రయత్నాలను చైనా చేస్తున్నట్టు డ్రాగన్ అధికార మీడియా సైతం వెల్లడించింది.