హైదరాబాద్ ‌లో మెట్రో పరుగులు పెడుతున్నా.. ఆర్టీసీ సర్వీసులు ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ సేవలు ఉపయోగించుకోవాలని మెట్రో భావిస్తోంది. పలు అంశాలపై అధికారులతో చర్చిస్తోంది.

కరోనా కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. కొన్ని అత్యవసర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం, అలాగే ఎయిర్‌పోర్టు ప్రయాణీకుల కోసం కొన్ని సర్వీసులు తిరుగుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్ మెట్రో మూడు కారిడార్లలో పరుగులు పెడుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా సిటీ శివారు ప్రాంతాల నుంచి మెట్రోలో ప్రయాణించాలంటే సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో ప్రయాణీకుల సంఖ్య పెంచుకునేందుకు మెట్రో అధికారులు కసరత్తు చేస్తున్నారు.

గ్రేటర్ పరిధిలో రోజుకు 45 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణించేవారు. ప్రస్తుతం సర్వీసులు తిరగకపోవడంతో 3 వేలకు పైగా బస్సులు డిపోల్లోనే ఉండిపోయాయ్‌. ఇటు సంస్థ ఆర్ధికంగా తీవ్ర నష్టం చూస్తోంది.  వీటి నుంచి గట్టెక్కేందుకు కార్గో, పార్శిల్ సర్వీసు వంటివి అందుబాటులోకి తెచ్చింది. సొంతంగా పెట్రోల్ బంకుల నిర్వహణ చేపట్టింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించిన ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్, మెకానిక్‌లను ఇతర విధులకు ఉపయోగించుకుంటోంది.

ఇక మెట్రో విషయానికి వేస్తే సర్వీసులు నడుస్తున్నా శివారు ప్రాంతాల్లో స్టేషన్ల వరకు చేరేందుకు సరైన రవాణాల లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రద్దీ ఉన్న స్టేషన్ల వద్ద ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచాలని కోరుతోంది మెట్రో. ఇటు సర్వీసులకు అనుమతి లేనందున అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని భావిస్తోంది.

మరోవైపు ఆర్టీసీ బస్సులకు అనుమతి ఇవ్వకపోవడంతో సంస్థ మరింత నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది.  ఇప్పటికే స్క్రాప్‌ పేరుతో నగరంలో 500లకు పైగా బస్సులను తొలగించిన ఆర్టీసీ.. త్వరలోనే మరో 500 బస్సులను వదిలించుకోవడానికి సిద్ధమైంది.  అయితే నష్ట నివారణ పేరుతో ప్రైవేటు సంస్థలకు ఆర్టీసీని అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడుతున్నాయ్‌ కార్మిక సంఘాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: