గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత కౌన్సిల్ పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 16తో ముగుస్తుంది. కానీ... నవంబర్ రెండో వారం తర్వాత ఏ క్షణమైనా ఎన్నికలు జరగొచ్చని మంత్రి కేటీఆర్ చెప్పడంతో... కాస్త ముందుగానే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయని తేలిపోయింది. మరోసారి గ్రేటర్ పీఠంను దక్కించుకోవాలని భావిస్తున్న టీఆర్ఎస్... ఇందులో భాగంగా ఇప్పటికే పలు సర్వేలు చేయించి గ్రేటర్ ప్రజల నాడిని తెలుసుకుంది. ఎన్నికల్లో విపక్షాలను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపైనా దృష్టి పెట్టింది. అర్బన్ ప్రాంతం కాబట్టి విస్తృతంగా సోషల్ మీడియాను వినియోగించుకొని గ్రేటర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది టీఆర్ఎస్. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఏం చేశాం... ఇంకా ఏం చేయాలనుకుంటున్నాం అనే అంశాలపై... సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించేందుకు సిద్ధం అవుతోంది. దీని కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా టీమ్‌లను రెడీ చేస్తోంది... టీఆర్ఎస్.
జీహెచ్ ఎంసీ పరిధిలో... నియోజకవర్గాల వారీగా సోషల్ మీడియా టీమ్‌లను ఏర్పాటు చేయనుంది టీఆర్ఎస్. విపక్ష పార్టీలు కూడా సోషల్ మీడియాలో నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తాయనే అంచనాతో ఉన్న టీఆర్ఎస్... ప్రధానంగా బీజేపీ వైపు నుంచి సామాజిక మాధ్యమాల్లో వచ్చే అంశాలపై కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల వేడి పెరిగే నాటికి అవసరమైతే మరిన్ని సోషల్ మీడియా టీమ్‌లను రంగంలోకి దింపాలని గులాబీ పార్టీ అనుకుంటోంది.
కరోనా మహమ్మారి దేశంలో చాలా చోట్ల విపరీతంగా వ్యాప్తి చెందినా... రాష్ట్రంలోనూ జీహెచ్ ఎంసీ పరిధిలోనూ ప్రభుత్వం కట్టడి చేయగలిగిందనే అభిప్రాయాన్ని ఇప్పటికే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన టీఆర్ఎస్... సోషల్ మీడియాలో మరింత విస్తృత ప్రచారం ద్వారా గ్రేటర్ ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.