గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయనే దానిపై పరోక్ష సంకేతాలిచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్. నవంబర్‌ రెండో వారం తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్‌ రావొచ్చన్న ఆయన... ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని సూచించారు. అలాగే... పనితీరు సరిగా లేని వారికి గట్టి హెచ్చరికలు కూడా చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు షెడ్యూల్ కంటే ముందుగానే జరుగుతాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ వేస్తున్న అడుగులు ఈ వాదనను బలపరిచేలా ఉన్నాయి. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం షెడ్యూల్ కంటే మూడు నెలల ముందు ఎన్నికలు జరుపుకునే వెసులుబాటు ఉంది. దీనితో అధికార పార్టీ గ్రేటర్ ఎన్నికలకు ముందుగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు కూడా దీన్ని బలపరుస్తున్నాయి.

నవంబర్ రెండో వారంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మంత్రి కేటీఆర్ కూడా... నవంబర్ రెండో వారం తర్వాత ఏ క్షణమైనా గ్రేటర్ ఎన్నికలు రావొచ్చని... జీహెచ్ ఎంసీ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సమావేశంలో చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా... పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. గ్రేటర్‌ కార్పొరేటర్లలో 15 శాతం మంది కార్పొరేటర్ల పనితీరు బాగోలేదని సర్వేలో తెలిసిందన్న ఆయన... ఇప్పటికైనా అలాంటి వాళ్లు పనితీరు మార్చుకోవాలని సూచించారు. ఏవైనా సమస్యలుంటే స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురావాలని కేటీఆర్ కార్పొరేటర్లతో చెప్పారు.

గ్రేటర్ ఎన్నికలకు సమాయత్తం అయ్యే క్రమంలో అభ్యర్థుల ఎంపికపైనా టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. గ్రేటర్లో ఉన్న సిట్టింగ్ కార్పొరేటర్లపై ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు నియోజవర్గానికి ఒక ఇన్‌ఛార్జ్‌ని పార్టీ నియమించినట్టు తెలుస్తోంది. అక్టోబర్ రెండో వారంలోపు సిట్టింగ్ కార్పొరేటర్లపై ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని... ఆ ఇన్‌ఛార్జ్‌లకు సూచించింది. ఫీడ్ బ్యాక్ వచ్చిన తర్వాత అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనుంది... టీఆర్ఎస్. గ్రేటర్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేని, ఒక ఎమ్మెల్సీని ఇన్‌ఛార్జ్‌గా నియమించాలనే ఆలోచనలో ఉంది...టీఆర్ఎస్. 

మరింత సమాచారం తెలుసుకోండి: