చైనాలో మరో కొత్త రకం వైరస్ బయటపడింది. ఇప్పటికే కరోనా వైరస్‌తో అతలాకుతలమౌతున్న ఆ దేశంలో కొత్త వైరస్ గురించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చైనాకు చెందిన 'కేట్ క్యూ వైరస్' అనే మరో జీవి వల్ల భారత్‌లో అనారోగ్య పరిస్థితులు తలెత్తే అవకాశముందని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ వైరాలజీ, పుణె విభాగం వెల్లడించింది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిపిన నమూనా పరీక్షల్లో ఈ వైరస్ ఉనికి కనిపించనప్పటికీ.. ప్రతి 883 మందిలో ఇద్దరికి ఈ వైరస్‌కు సంబంధించిన యాంటీబాడీలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు వివరించారు. వైరస్ దాడి చేసినపుడు దానిని ఎదుర్కొనేందుకు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ యాంటీ బాడీలను తయారు చేసుకుంటుంది.
దేశంలోని క్యులెక్స్ దోమలు, పందులలో ఈ వైరస్ ఉన్నట్టు వైరాలజీ విభాగం నిర్ధారించింది. దోమల నుంచి ఇంటిలో పెరిగే పందులకు సోకినట్టు తమ పరిశోధనల్లో తెలిసిందని శాస్త్రవేత్తలు వివరించారు. దోమల ద్వారా మనుషుల్లో ఈ వ్యాధి ప్రబలే అవకాశముంది. మన దేశంలో క్యూలెక్స్ దోమలు అధికంగా ఉండటం వల్ల, ఈ వ్యాధి మనుషుల్లోనూ వ్యాప్తించేందుకు అధిక అవకాశముందని సంస్థకు చెందిన శాస్త్రవేత్త హెచ్చరించారు.
చైనాలోని దోమలు, వియాత్నాంలోని పందుల్లో ఇప్పటికే కేట్ క్యూ వైరస్ ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు. అయితే దేశంలో దీని వ్యాప్తి గురించి మరింతగా తెలుసుకునేందుకు మనుషులు, పందుల నమూనాలను విస్తృతంగా పరీక్షించాలని ఐసీఎంఆర్ అభిప్రాయపడింది. మొత్తానికి చైనా నుంచి కొత్త వైరస్ లు పుట్టుకొస్తున్నాయి. యావత్ ప్రపంచాన్ని గజగజ వణికించేస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది కరోనా వైరస్.