ఏపి లో వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు లోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే మహిళలకు డ్వాక్రా రుణాలను అందజేసిన ప్రభుత్వం, రైతుల కోసం రైతు భరోసా ను కూడా ప్రవేశ పెట్టింది. ఏపిలో వయో వృద్దులకు, వితంతువులకు పింఛన్లు పెంచారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యం లో పింఛన్ డబ్బులను చేతికి ఇవ్వకుండా అకౌంట్లో వేస్తూ వచ్చారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వాలంటీర్లు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేస్తున్నారు. కొత్త పద్ధతులను ఉపయోగించి పింఛన్ ను పంపిణీ చేస్తున్నారు.



వచ్చే నెల నుంచి పింఛన్ దారులకు 250 రూపాయలు చొప్పున పెంచనున్నట్లు ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు ఏపి సర్కార్ సర్వం సిద్ధం చేసింది. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకను నవంబరు 1న రాష్ట్ర వ్యాప్తంగా 61.65 లక్షల మంది లబ్ధిదారులకు వాలంటీర్ల ద్వారా నేరుగా అందించనుంది. అందుకుగానూ, రూ. 1,497.88 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలలో కొత్తగా 34,907 మందికి పెన్షన్‌ మంజూరు చేశారు. కొత్తగా పింఛన్లు ఇచ్చే వారి కోసం 8.52 కోట్లు  మంజూరు చేసినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.



ఈసారి కూడా బయోమెట్రిక్‌కు బదులు పెన్షనర్ల ఫోటోలను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా బయో మెట్రిక్‌కు బదులు బయో ట్యాగింగ్ ద్వారా పింఛన్లు అందజేస్తున్నారు. ఫోటో ద్వారా ధ్రువీకరించి పింఛన్ పంపిణీ  పింఛన్లు ఇస్తున్నట్లు మంత్రి అన్నారు. కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా  తగ్గిన తర్వాతే మిగతా వాటిని అమలు చేస్తామని అధికారులు వెల్లడించారు. 250 రూపాయలు పెంచడం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: