యూఏఈలో కొనసాగుతున్న ఐపీఎల్-2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చవి చూసిన రెండు వరుస పరాజయాలు.. ఓ నిఖార్సయిన ఆల్‌రౌండర్ అవసరాన్ని ఎత్తి చూపాయి. బ్యాటింగ్, బౌలింగ్.. చివరికి ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపించగల సత్తా ఉన్న నాణ్యమైన ఆల్ రౌండర్‌ను అర్జెంట్‌గా జట్టులోకి తీసుకోవాల్సి ఉంటుందనే సంకేతాలను పంపించాయి. ఈ పరిణామాలు- టోర్నమెంట్ ప్రారంభానికి ముందే జట్టుకు దూరమైన సురేష్ రైనా ఎంత విలువైన ఆటగాడో తెలిసేలా చేశాయి.
టీమ్ మళ్లీ విజయాల బాట పట్టాలంటే సురేష్ రైనా లాంటి ఆల్‌రౌండర్ అవసరం ఉందంటూ సోషల్‌మీడియాలో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. అయితే దీనిపై చెన్నై యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో రైనాను వెనక్కి పిలిపించే ప్రతిపాదన తమ వద్ద లేదంటూ ప్రకటించింది. సురేష్ రైనానే జట్టును విడిచాడని గుర్తు చేసింది యాజమాన్యం. ఈ వ్యాఖ్యలతో సురేష్ రైనాను పక్కన పెట్టడానికే సీఎస్‌కే సిద్ధమైందని అర్ధమవుతోంది. తనను మళ్లీ పిలిపిస్తారేమోననే ఆశలు ఏవైనా సురేష్ రైనాలో ఉండి ఉంటే.. ఈ ప్రకటనతో అవి అడుగంటిపోయినట్టే.
సీఎస్‌కే ప్రకటన తర్వాత రైనా తీసుకున్న చర్యలు జట్టుతో తన బంధం ఇక తెగినట్టేనని చెప్పకనే చెబుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక సోషల్ మీడియా పేజీని సురేష్ రైనా అన్ ఫాలో చేశాడు. ప్రకటన వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన సీఎస్‌కే సోషల్ మీడియా పేజీ నుంచి వైదొలిగాడు. అతని చర్యలు అనేక అనుమానాలకు తావిస్తోంది. జట్టును వీడటానికి తాను సిద్ధంగా ఉన్నాననే సందేశాన్ని అతను పంపించాడా? అనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.