లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో పూటగడిచే పరిస్థితి కనిపించడం లేదు. ఈ కష్టకాలంలో ఒక్కసారిగా పెరిగిన ధరలు.. సగటు జీవి బతుకును నరక ప్రాయం చేస్తున్నాయి. పెరిగిన ధరలు.. నెలవారీ బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. ఒక్కో కుటుంబంపై నెలకు 1500 నుంచి 2000 రూపాయల వరకూ అదనపు భారం పడుతోంది.
వారం తిరిగేసరికి వంటనూనె ధర అమాంతం పెరిగింది. గతంలో లీటర్‌పై 2 నుంచి 5 రూపాయలు మాత్రమే పెరిగే నూనె ధర.. ప్రస్తుతం హోల్‌సేల్‌లోనే ఏకంగా 30 నుంచి 40 రూపాయల దాకా పెరిగింది. కిరాణా స్టోర్స్‌లో లీటర్ ఆయిల్ ప్యాకెట్ ధర 95 నుంచి 130 రూపాయలకు ఎగబాకింది. ఈ ధరలు తట్టుకోలేక కొంతమంది...తక్కువ ధరలకు లభించే రెండో రకం సరుకులతో సరిపెట్టుకుంటున్నారు.
పప్పుల ధరలు వింటేనే గుండె దడ పుడుతోంది. కిలో 95 రూపాయలుగా ఉన్న కందిపప్పు ..110 రూపాయలు దాటింది. మినపపప్పు 110 నుంచి 130 రూపాయలకు చేరింది. కిలో చికెన్ 230 నుంచి 240 రూపాయల దాకా ఉంటోంది. 5 రూపాయల 50 పైసలున్న గుడ్డు ధర 7 రూపాయలకు చేరింది.
ఐదు వందల రూపాయల నోటుతో రైతు బజార్‌కు వెళ్తే కానీ .. సంచి నిండే పరిస్థితి కనిపించడం లేదు. ఏ కూరగాయలు చూసినా కిలో 60 నుంచి 80 దాకా ఉంటోంది. ఆకు కూరల ధరలు సైతం భగ్గుమంటున్నాయి. గతంలో 10 రూపాయలకి మూడు నాలుగు కట్టలొచ్చే ఆకుకూరలు... 20 రూపాయలు పెడితే కానీ దొరకడం లేదు. కిలో ఉల్లిగడ్డ 40 నుంచి 50 కి చేరింది.
పెరిగిన ధరలకు తగ్గట్టుగా ఆదాయం పెరగకపోవడంతో.. సామాన్యుడి బతుకు చిత్రం మారిపోయింది. పెరిగిన ధరలతో ప్రతిఒక్కరి పరిస్థితి... అప్పు చేసి పప్పు కూడు అన్నట్టు మారింది.