ఏపీలో వామపక్ష పార్టీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారు ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో వారికే క్లారిటీ ఉండదు. అలాగే ఎప్పుడు ఎవరిని తిడతారో ?  ఎవరిని పొగుడుతారో కూడా ఎవరికీ తెలియదు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం సిపిఐ నారాయణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విశాఖపట్నంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణలు బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నారాయణ వైసిపి, టిడిపి, జనసేన బీజేపీ ఇవన్నీ ఒక తానులో ముక్కలే అని, ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.


 కేసులు భయంతోనూ, తనను జైలుకు పంపిస్తారు అనే భయంతో జగన్, చంద్రబాబు ఇద్దరూ మోదీకి మద్దతు పలుకుతున్నారని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లపై పడ్డారు అంటూ నారాయణ విమర్శించారు. అక్కడితో ఆగకుండా కొద్ది రోజులుగా పవన్ దీక్షలు, మాసికాలు అంటూ హడావుడి చేస్తుండటంపైనా నారాయణ తప్పుపట్టారు. మాసికాలు ఎవరు చేస్తారండి ? పెళ్లి కాని వాళ్లు సన్యాసులు చేస్తారు. పవన్ కళ్యాణ్ మాత్రం మూడు పెళ్లిళ్లు చేసుకుని మాసికాలు చేస్తున్నాడు. గత ఎన్నికల్లో బుద్ధి తక్కువై కమ్యూనిస్టు పార్టీలు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నాయి, దానికి ఎంతగానో చింతిస్తున్నాము అంటూ నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


ఈ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మౌనంగానే ఉ,న్నా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం నారాయణ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే నైతిక హక్కు నారాయణకు లేదని, అసలు గత ఎన్నికల్లో పవన్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు మీరు మీయొక్క జ్ఞాపక శక్తిని కోల్పోయేరా అంటూ వీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు

మరింత సమాచారం తెలుసుకోండి: