ఎక్కడికక్కడ గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టే విధంగా నాయకులకు వార్నింగ్ ఇస్తున్నా, పరిస్థితిలో మార్పు రాకపోవడం, ఎవరికివారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడం వంటి కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అభాసుపాలవుతూ వస్తోంది. ఇదిలా ఉంటేే ఇప్పుడు కొత్తగా గన్నవరం తలపోటు వివాదాస్పదమవుతోంది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వంశీ వైసీపీ కి జై కొట్టిన దగ్గర నుంచి గన్నవరం నియోజకవర్గంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ముఖ్యంగా యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రావు వర్గాలు వంశీ విషయంలో ఆగ్రహంగా ఉండడం, వంశీ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వైసిపి కార్యకర్తలను వేధించడం, ఇలా అన్ని పరిణామాలను గుర్తుచేసుకుంటూ, వంశీ కి అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.
పదేళ్లుగా టీడీపీలో ఉన్న వంశీ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి విజయవాడ పార్లమెంట్ నుంచి ఎంపీగాా పోటీ చేసి ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరినా, ఇప్పుడు తీవ్ర ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొంటున్నారు. ముందు ముందు యార్లగడ్డ, దుట్టా వర్గాలతో వంశీ తలపడే అవకాశం ఉండడంతో గన్నవరంలో వివాదాలు మరింత ముదిరేలా కనిపిస్తుండటం వంటివి రాజకీయంగాను, మానసికంగానూ వంశీకి తీవ్ర ఇబ్బందులు కలిగించే అవకాశం లేకపోలేదు.