అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం ముగిసింది. ప్రస్తుత సీఎం పళనిస్వామికి మరో అవకాశం దక్కింది. సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును పన్నీర్ సెల్వం ప్రతిపాదించారు. పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతను పన్నీర్ సెల్వంకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై పళనిస్వామి, పన్నీర్ సెల్వం సంతకాలు చేశారు. ఎన్నికల కోసం 11 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో పళనిస్వామి మద్దతుదారులు ఆరుగురు, పన్నీర్ సెల్వం మద్దతుదారులు ఐదుగురు ఉన్నారు.
జయలలిత లేకుండా తొలిసారి ఎన్నికల్లో పోటీచేయబోతున్న అన్నాడీఎంకెలో కొన్నాళ్లుగా ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనేదానిపై విభేదాలు వచ్చాయి. ఈసారి అవకాశం తనకు ఇవ్వాలని పన్నీర్ సెల్వం పట్టుబట్టారు. అయితే మరోసారి తానే అభ్యర్ధిగా ఉంటానని పళనిస్వామి తెగేసి చెప్పారు. కొన్నాళ్లుగా ఇద్దరి మధ్యా వివాదం నడిచిన తర్వాత ఎట్టకేలకు పన్నీరు, పళని మధ్య సయోధ్య కుదరింది. అన్నాడీఎంకె కార్యవర్గ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కలిసి జయలలిత సమాధి దగ్గర నివాళులర్పించారు.
మరోవైపు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సన్నిహితురాలైన శశికళకు ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయ పన్ను అధికారులు ఆమెకు చెందిన రూ 2000 కోట్ల విలువైన ఆస్తులను బినామీ నిరోధక చట్టం కింద సీజ్ చేశారు. ఆదాయపన్ను శాఖకు చెందిన బినామీ నిరోధక విభాగం అధికారులు.. ఈమేరకు నోటీసులు అతికించారు.
మొత్తానికి అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ఇద్దరి మధ్య సయోధ్య కుదరడంతో వివాదం సద్దుమణిగింది. లేకపోతే ఇటు పళని, అటు పన్నీ వర్గాలు తమ నాయకుడే సీఎం అభ్యర్థంటూ పోటా పోటీ నినాదాలు చేసి బలం చాటుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇద్దరు అగ్రనాయకుల మధ్య సయోధ్య కుదరడంతో ఆ వివాదానికి తెరపడింది.