వైసీపీ ఎన్డీయేలో చేరి రెండు కేంద్ర మంత్రి పదవులు తీసుకునే అవకాశముందని ప్రచారం నడుస్తుంది. అయితే ఈ వార్తలని వైసీపీ పెద్దగా ఖండించినట్లు కనిపించలేదు. అదే సమయంలో వైసీపీ నుంచి గెలిచి, అదే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న రఘురామకృష్ణంరాజు మాత్రం, వైసీపీకి అంత సీన్ లేదని కొట్టిపారేస్తున్నారు. వైసీపీ కావాలనే ఎన్డీయేలో చేరుతున్నట్లు ప్రచారం చేసుకుంటుందని చెబుతున్నారు.
కానీ టీడీపీ నుంచి మాత్రం ఇలాంటి వాదన వినిపించడం లేదు. వైసీపీ ఖచ్చితంగా ఎన్డీయేలో చేరుతుందనే విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఇదే అంశాన్ని టచ్ చేశారు. ఎన్డీఏలో కలిస్తే మంత్రి పదవి వస్తుందన్న ఉత్సాహం వైసీపీ ఎంపీల్లో కనిపిస్తోందని, కానీ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా వారికి అక్కర్లేదనీ విమర్శిస్తున్నారు. అయితే కేంద్ర పెద్దలతో మంచి సఖ్యతగా ఉండే రామ్మోహన్ వైసీపీ ఎన్డీయేలో చేరుతుందనే అంశాన్ని టచ్ చేశారంటే, కేంద్రంలో ఏదో జరుగుతుందని తెలుస్తోంది.
అయినా వైసీపీ కేంద్రంతో లాబీయింగ్ చేస్తున్నట్లు ఏదైనా సమాచారం ఉండి మాట్లాడినట్లే కనిపిస్తోంది. అయితే వైసీపీ ఎన్డీయేలో చేరితే రాష్ట్రానికి మేలు జరిగే అవకాశాలున్నాయని విశ్లేషుకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో గతంలో ఎన్డీయేలో ఉన్న టీడీపీని ప్రత్యేకహోదా కోసం బయటకు రావాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఇప్పుడు వైసీపీ ఎన్డీయేలో చేరితే టీడీపీ విమర్శనస్త్రాలు సంధించడం ఖాయం. మరి చూడాలి ఏపీ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో.