అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థుల‌ ముఖాముఖి వాడివేడిగా జరిగింది. సాల్ట్‌లేక్‌లోని కింగ్స్‌ బర్రీహాల్‌లో జరిగిన ఈ డిబేట్ లో ట్రంప్ ప్రభుత్వం కరోనా వ్యాప్తిని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని డెమొక్రాటిక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థి కమలా హారిస్‌ ఆరోపిస్తే, అమెరికన్ల ఆరోగ్యానికి ట్రంప్‌ ప్రథమ స్థానం ఇచ్చారని రిపబ్లికన్ పార్టీ వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థి మైక్‌ పెన్స్‌  కౌంటర్ ఇచ్చారు.  

అమెరికాలోని సాల్ట్‌లేక్‌లోని కింగ్స్‌ బర్రీహాల్‌లో  వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్ధుల మధ్య డిబేట్ ఆరోపణలు.. ప్రత్యారోపణల మధ్య సాగింది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యిందని.. డెమొక్రాటిక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థి కమలా హారిస్‌ ఘాటుగా విమర్శించారు. రిపబ్లికన్ పార్టీ అసలు ఎన్నికల్లో పోటీ చేసేఅర్హత కోల్పోయిందని మండిపడ్డారు.

హారిస్‌ వ్యాఖ్యల్ని రిపబ్లికన్ పార్టీ వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థి మైక్‌ పెన్స్‌ తిప్పికొట్టారు. మరే ఇతర అధ్యక్షుడు చేయని విధంగా ట్రంప్‌ చర్యలు తీసుకున్నారని,  ఆయన నిర్ణయం లక్షలాది మంది ప్రాణాలను కాపాడిందని పెన్స్ సమర్ధించుకున్నారు. వ్యాక్సిన్‌ విషయంలో హారిస్‌ చేసిన వ్యాఖ్యలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని ఆరోపించారు.

కమలా హారిస్‌, మైక్‌ పెన్స్‌ మధ్య ముఖాముఖిలో జాతి విద్వేషం అంశంపై వీరిద్దరూ హోరాహోరీగా వాదిస్తుండగా, అకస్మాత్తుగా ఓ ఈగ వచ్చి పెన్స్‌ తలపై వాలింది. పెన్స్‌ మాట్లాడుతున్నప్పటికీ కొన్ని నిమిషాల పాటు ఈగ కదలకుండా అక్కడే ఉంది.ఇంటర్నెట్‌లో ఈ ఘటన సెన్సేషన్‌ అయ్యింది. వీరి డిబేట్‌ను ఇంటర్నెట్‌ లైవ్‌లో చూసిన వారంతా కమలా హారిస్‌, పెన్స్‌ మాటలను పట్టించుకోకుండా కాసేపు ఈగ గురించే మాట్లాడుకున్నారు. పలువురు నెటిజన్లు దీనిపై జోకులు పేల్చారు. ఆ ఈగకు కరోనా వైరస్‌ పరీక్షలు చేయించాలంటూ పోస్టులు చేశారు.

అమెరికా ఎన్నికల డిబేట్‌లో ఊహించని అతిథి రావడం ఇదే తొలిసారి కాదు. 2016లో అప్పటి డెమొక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటర్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య ముఖాముఖి జరుగుతుండగా, ఓ ఈగ హిల్లరీ నుదురుపై వాలింది. ఆ ఘటన అప్పట్లో ఇంటర్నెట్‌ సెన్సేషన్‌ అయ్యింది.  







మరింత సమాచారం తెలుసుకోండి: