కరోనా కల్లోలంతో ఆర్థికంగా కుదేలై.. ఈఎంఐలు కట్టలేని వారికి కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చేసింది. రుణగ్రహీతలకు చక్రవడ్డీ మాఫీ చేశామని.. ఇంతకంటే ఎక్కువ ఉపశమనాలు ఇవ్వలేమని తాజాగా సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. రుణాల చెల్లింపునకు ఇప్పటికే ఆరునెలల మారటోరియం ప్రకటించామని, దీన్ని మరింత కాలం పొడగించడం కుదరదని వెల్లడించింది.
రుణగ్రహీతలకు ఊరట కలిగించేలా మారటోరియం కాలంలో విధించే చక్రవడ్డీని మాఫీ చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో కేంద్రం, ఆర్బీఐ కలిసి.. కోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేశాయి. ఆర్థిక విధానాలు ప్రభుత్వానికి చెందినవని, ఇందులో కోర్టుల జోక్యం తగదని అభిప్రాయపడిన కేంద్రం.. చక్రవడ్డీ మాఫీ మినహా ఇతర ఉపశమనాలు కల్పించలేమని స్పష్టం చేసింది. అలా చేస్తే ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ రంగం ప్రమాదంలో పడుతుందని పేర్కొంది.
లోన్‌లపై మారటోరియం గడువును మరింతకాలం పెంచలేమని సుప్రీంకోర్టుకు తెలిపింది ఆర్బీఐ. మారటోరియం కాలాన్ని పొడిగిస్తే అది వాయిదాల చెల్లింపులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయపడింది. అంతేగాక రుణగ్రహీతలపై భారం పెరుగుతుందని పేర్కొంది. ఈ అఫిడవిట్‌పై అక్టోబరు 13న కోర్టు విచారణ జరపనుంది.
కరోనా కారణంగా మార్చి 1 నుంచి మే 31 వరకు మారటోరియం ప్రకటించింది ఆర్బీఐ. ఆ తర్వాత ఆగస్టు 31 వరకు గడువునూ పొడిగించింది. అయితే మారటోరియంపై పిటిషన్‌లు దాఖలు కావడంతో విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. కేంద్రం నుంచి వివరణ కోరింది. గతంలో ఇచ్చిన సమాధానంతో సుప్రీం సంతృప్తి చెందకపోవడంతో.. తాజాగా, అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం.. ఇంతకు మించి ఏం చేయలేమని కుండబద్దలు కొట్టేసింది.