కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సరిగ్గా ఈ ఏడాది మార్చి 16వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు మూతబడిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా స్కూల్స్ పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు. జూన్ 17 నుంచి దేశంలో అన్లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. అక్టోబర్ 15 తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలు తెరిచే విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి అంటూ కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వెనకడుగు వేయక తప్పడంలేదు. రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో... విద్యా సంస్థలు తెరిస్తే విద్యార్థులు ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని భావించిన రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో ఇప్పటికికూడా విద్యాసంస్థలు తెరవలేకపోతున్నారు.
ఇక రాబోయే రోజుల్లో కరోనా వైరస్ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే దేశంలో స్కూల్స్ మూసివేత కారణంగా ఎంత నష్టం వాటిల్లింది అనేదానిపై ఇటీవలే ప్రపంచ బ్యాంకు సర్వే నిర్వహించగా ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి. స్కూల్స్ మూసివేత కారణంగా భారత్ కు 400 బిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది. ఇప్పటికే సగం విద్యాసంవత్సరం కోల్పోయినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఇంటిపట్టునే ఉంటున్నా విద్యార్థులు లెర్నింగ్ స్కిల్స్ కోల్పోతున్నారని తద్వారా భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంచనా చేస్తున్నారు నిపుణులు.