గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ ఎన్నికకు ముహుర్తం కుదిరింది. ఫిబ్రవరి 11న కొత్త పాలకవర్గం కొలువు దీరుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చింది. అదే రోజు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ఉంటుందని తెలిపింది. గ్రేటర్‌లో హంగ్‌ రావడంతో ఈ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.

గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్ , డిప్యూటీ మేయర్ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఫిబ్రవరి 11న కొత్త మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు.  ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు ముందుగా మేయర్‌, ఆ తర్వాత డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారు. ఏదైనా కారణాలతో 11న ఎన్నిక నిర్వహించలేని పక్షంలో మరుసటి రోజు ఎన్నిక నిర్వహించాలని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.
 
మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక పర్యవేక్షణకు ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని నియమించనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే కొత్తగా ఎన్నికైన 150 మంది కార్పొరేటర్ల పేర్లను నమోదు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. డిసెంబర్‌లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లో హంగ్‌ ఏర్పడింది.  

ఇటీవలి ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ 56 సీట్లకే పరిమితమైంది. 2016 ఎన్నికల్లో 99 చోట్ల నెగ్గి ఏకపక్షంగా గ్రేటర్‌ మేయర్‌ పీఠాన్ని సొంతం చేసుకున్న గులాబీ పార్టీకి ఈసారి ఏకంగా 43 స్థానాలు తగ్గాయి. బీజేపీ 48 డివిజన్లలో విజయం సాధించింది. కాగా మజ్లిస్‌ మరోసారి తన బలాన్ని 44 స్థానాల్లో నెగ్గించుకుంది. అయితే ఇక్కడ ఎక్స్‌ అఫిషియో ఓట్లు కూడా కీలకం కాబోతున్నాయి. దీంతో మేయర్‌ పీఠం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది.

మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికకు ముహూర్తం ఖరారైపోయింది. అంతేకాదు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా ఉండటంతో రాజకీయ వర్గాల్లో ఒకింత ఉత్కంఠ నెలకొంది. బల్దియాను ఏలే ఆ వ్యక్తి ఎవరో అనే దానిపై హైదాబాద్ ప్రజల్లో ఆసక్తి నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: