వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిసిన వాతవరణ శాఖ.. జీహెచ్‌ఎంసీ అధికారులను అప్రమత్తం చేసిందా అనేదే పెద్ద ప్రశ్న. ఒక వేళ హెచ్చరించి ఉంటే అధికారులు ఏం చేశారు..? లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారా..? అంటే ఏమో అనే సమాధానమే వస్తోంది. భారీ వర్షాల హెచ్చరికలు వచ్చినా.. జీహెచ్‌ఎంసీ అధికారులు చేసిన అప్రమత్తత శూన్యం.
అధికారుల నిర్లక్ష్యానికి కొందరు విద్యుత్ షాక్‌లతో కన్ను మూశారు. అనేక ఇళ్ళు నేలమట్టం అయ్యాయి. వందలాది కార్లు, వేలాది ద్విచక్ర వాహనాల నష్టం ఇప్పటికిప్పుడు అంచనా కట్టలేనిది. ఇంతటి ఉపద్రవానికి ప్రకృతిని నిందించడం మాటెలా ఉన్నా మనిషి చేసుకున్న స్వయంకృతం అనేది నిపుణులు తేలుస్తున్న అంశం. వివిధ శాఖల నడుమ అవగహన లేమి దీనికి తోడు అవుతుంది. రాబోయే విపత్తులను అంచనా వేసి డ్రైన్ల నిర్మాణం చేయకపోవడం ప్రజల పాలిట శాపంగా మారిపోయింది.
హైదరాబాద్ అభివృద్ధికి వేలకోట్ల రూపాయలు ఏ సర్కార్ అధికారంలో ఉన్నా ఖర్చు చేస్తున్నాయ్. కానీ, ఆ నిధులు ఎక్కువ భాగం ఖర్చు చేసేది సుందరీకరణకు మాత్రమే. డ్రైన్ల పై శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు సిల్ట్ క్లిన్ చేయడం వంటి కార్యక్రమాలను జీహెచ్‌ఎంసీ ప్రణాళికా బద్దంగా చేపట్టడం లేదన్నది తాజా ఉపద్రవం రుజువు చేసింది. భాగ్యనగరం విశ్వ నగరం అంటూ ప్రచారం చేసుకోవడమే కానీ.. భారీ వర్షాలు సంభవిస్తే సిటీ హుస్సేన్ సాగర్ అయిపోతుందన్న చేదు నిజం ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్ధమవుతోంది.
మరోవైపు.. వాతావరణం మీద శ్రద్ధ అధికారులకే కాదు.. ప్రజలకు కూడా లేదు. విదేశాల్లో వెదర్ రిపోర్ట్ చూశాకే అడుగు బయటపెడతారు. కానీ మన దగ్గర మేఘాలు కనిపించాకే గొడుగు పట్టుకుంటారు. వాతావరణం అంటే ప్రజల్లో కూడా ఆసక్తి ఉండదు. వాతావరణం మీద ప్రజల్ని చైతన్య పర్చాల్సిన ప్రభుత్వ యంత్రాంగమే మొద్దు నిద్రపోతుంటే.. జనంలో చైతన్యమెలా వస్తుంది చెప్పండి. తరతరాలుగా వ్యవసాయమే ఆధారంగా అడుగులేస్తున్న మన లాంటి దేశంలో ఇన్ని శతాబ్దాలు గడిచినా.. ఇన్నేసి రాకెట్లు పంపినా.. టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందుతున్నా.. వెదర్ ఫోర్ క్యాస్ట్ అనేది వెనకబడే ఉంది.
కురిసింది నాలుగు గంటల వర్షమే అయినా.. అధికారుల వైఫల్యాన్ని కళ్లకు కట్టింది. గత ఏడాది పరిస్థితులు రిపీట్ కావొద్దని మంత్రి కేటీఆర్ హెచ్చరించినా.. అధికారుల నిర్లక్ష్యం ముందు ఆ వార్నింగ్ లు బేఖాతర్ అయ్యాయి. డ్రైనేజీలు, నాలాల్లో పూడిక పనుల పూర్తి చేసామని ఘనంగా చెప్పుకున్న జీహెచ్ఎంసీ.. అదే నాలాలు.. కేవలం నాలుగు గంటల వర్షానికే పొంగిపొర్లడంతో అవాక్కైంది.