వాయుగుండం దక్షిణ మధ్య మహారాష్ట్రను ఆనుకుని ఉన్న దక్షిణ కొంకణ్ వద్ద తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో స్పియర్ స్థాయిల వరకు కొనసాగుతున్నట్లు అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మహారాష్ట్రకు దగ్గరలోని తూర్పు మధ్య అరేబియా సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం తదుపరి 48 గంటల్లో మహారాష్ట్ర-దక్షిణ గుజరాత్ తీరాలను ఆనుకుని తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా దానిని ఆనుకొని ఉన్న ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతాలలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.
ఈ వాయుగుండం క్రమేపి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఉత్తరాంధ్ర, తెలంగాణ దక్షిణ మధ్య మహారాష్ట్ర దానికి ఆనుకొని ఉన్న దక్షిణ కోంకణ్ వద్ద కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా మధ్య ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో అక్టోబర్ 19వ తేదీన మధ్య అరేబియా సముద్రంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణా కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలతో పాటు రాయలసీమ, యానాంలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కు వానగండం పొంచే ఉంది. కోస్తా.. రాయలసీమపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.