అయితే ఇలా తమపైనే విమర్శలు చేస్తున్న రాజుగారికి చెక్ పెట్టాలని వైసీపీ అధిష్టానం ఎప్పటి నుంచో చూస్తుంది. ఇప్పటికే ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. కానీ ఆ అనర్హతపై ఇంకా ఏమి తేలలేదు. పైగా కేంద్రంలోని బీజేపీ పెద్దలతో రాజుగారికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. దీంతో ఎంపీపై వేటు వేయడం అంత సులువైన పని కాదని అంతా అనుకున్నారు.
దానికి తగ్గట్టుగానే రాజుగారి మాటలు ఉండేవి. తనని వైసీపీ ఏమి చేయలేదు అన్నట్లుగానే మాట్లాడేవారు. కానీ తాజా పరిణామాలని చూస్తే పరిస్తితి కాస్త మారినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవలే రాజుగారికి చెందిన సంస్థలపై సిబిఐ దాడులు జరిగాయి. అలాగే ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. ఈ విషయాన్ని ఎంపీనే స్వయంగా వెల్లడించారు. పైగా తన మీద సిబిఐ దాడులు జరగడానికి కారణం ఎవరో కూడా తెలుసని మాట్లాడారు.
ఇది ఇలా జరుగుతుండగానే, తాజాగా రాజుగారి పదవి ఊడింది. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నుంచి రఘురామని తప్పించి, వైసీపీకి చెందిన బాలశౌరిని పెట్టారు. దీంతో నిదానంగా రాజుగారు కథ కంచికి చేరబోతుందని తెలుస్తోంది. త్వరలోనే ఆయన ఎంపీ పదవిపై కూడా వేటు పడొచ్చని ప్రచారం జరుగుతుంది. అందుకే ఆయన పదే పదే అమరావతి రెఫరెండంగా ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, దమ్ముంటే జగన్ పోటీ పెట్టి గెలవాలని సవాల్ విసురుతున్నారు. జగన్ పోటీ చేసిన రెండు లక్షల మెజారిటీతో గెలుస్తానని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మొత్తానికైతే రాజుగారి చాప్టర్ క్లోజ్ కానుందని తెలుస్తోంది.