మహబూబాబాద్‌లో బాలుడు దీక్షిత్‌ రెడ్డి హత్య కేసులో నిందితుడు మందసాగర్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. హైటెక్‌ పద్ధతిని ఉపయోగించి అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్టు గుర్తించారు. రిమాండ్‌ రిపోర్టులో.. కీలక అంశాలు పొందుపరిచారు పోలీసులు. అంతేకాదు పోలీసులకు ఫిర్యాదు అందకముందే.. హంతకుడు బాలుడిని చంపేసినట్టు నిర్ధారించారు.

మహబూబాబాద్‌ బాలుడు దీక్షిత్‌రెడ్డి హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఏడాది నుంచి డింగ్‌టాక్‌ యాప్‌ వాడుతున్న నిందితుడు  మందసాగర్‌.. ఆ యాప్‌ద్వారానే దీక్షిత్‌రెడ్డి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి బెదిరించాడు. తన గర్ల్ ఫ్రెండ్‌కు కూడా నిందితుడు డింగ్‌టాక్‌ యాప్ ద్వారానే కాల్‌ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు.

ఈనెల 18, ఆదివారం నాడు.. ఇంటి దగ్గర ఆడుకుంటున్న దీక్షిత్‌ రెడ్డిని.. పెట్రోల్‌ బంక్‌కు వెళ్దామని బండిపై ఎక్కించుకున్నాడు మందసాగర్‌. తెలిసిన వ్యక్తే కావడంతో దీక్షిత్‌ కూడా వెనుకంజ వేయలేదు. బాలుణ్ని తీసుకుని దగ్గర్లో ఉన్న దానమయ్య గుట్టకు వెళ్లాడు సాగర్‌. అయితే, ఆ పరిసరాల్ని చూసి భయపడిన దీక్షిత్‌.. ఇంటికి వెళ్దామని ఏడ్వడం మొదలెట్టాడు. అయితే, బాబు ఏడుపువల్ల దొరికిపోతాననే భయంతో.. నిద్రమాత్రలు కలిపిన మంచినీళ్లను బాలుడితో  తాగించాడు మందసాగర్‌.  స్పృహ వచ్చే లోపే చిన్నారిని చంపేసి.. కిరాతకంగా పెట్రోల్‌ పోసి తగలబెట్టేశాడు.  

బాలుడిని చంపేశాక అసలు నాటకం మొదలెట్టాడు మందసాగర్‌. డింగ్‌టాక్‌ యాప్ ద్వారా తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఫోన్ ద్వారా కాకుండా యాప్‌తో ఫోన్ చేయడంతో అతడిని పట్టుకోవడం పోలీసులకు కొంత ఆలస్యమైంది. జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనించిన సాగర్‌.. దీక్షిత్‌రెడ్డి ఇంటికి పోలీసులు రావడంతో పాటు వాళ్లంతా మఫ్టీలో తిరుగుతున్న విషయాన్నీ గుర్తించాడు. అందుకే, దీక్షిత్‌రెడ్డి కుటుంబసభ్యులు తెచ్చిన డబ్బులు తీసుకునేందుకు కూడా ముందుకు రాలేదు. బాలుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడం కంటే ముందే దీక్షిత్‌రెడ్డిని సాగర్ హత్య చేసినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో రాశారు.

సీసీ కెమెరాలకు చిక్కకుండా హైటెక్నాలజీ వాడి.. పోలీసుల కళ్లుగప్పేందుకు మందసాగర్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇంటర్నెట్‌ కాల్స్‌ చేస్తున్నాడని పసిగట్టిన పోలీసులు.. ట్రాప్‌ చేసి పట్టుకున్నారు. అతని దగ్గర ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: