అటు తెలంగాణ అధికారులు.. తప్పంతా ఏపీఎస్ఆర్టీసీదే నంటారు. ఇటు ఏపీ అధికారులు మాత్రం.. తాము అన్ని త్యాగాలకు సిద్ధపడ్డా కూడా తెలంగాణ నుంచి సానుకూల సంకేతాలు అందడంలేదంటారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. అంతిమంగా రెండు సంస్థలు నష్టపోతున్నాయి, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
ఏపీ అధికారుల తాజా వాదన ఇదీ..
తెలంగాణ ఆర్టీసీ అధికారులు కోరినట్లే ప్రతిపాదనలు పంపించామని, రూట్ల వారీగా స్పష్టత ఇచ్చామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ 1.04 లక్షల కి.మీ. పరిధిని తగ్గించుకుని, 1.61 లక్షల కి.మీకే పరిమితం అయిందని ఆయన చెప్పారు. ఈ ప్రతిపాదనలతో ఏపీఎస్ఆర్టీసీకి నష్టం వస్తున్నా ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా టీఎస్ఆర్టీసీ డిమాండ్లకు అంగీకరించామని ఆయన వివరించారు. ఈ నెల 19వ తేదీన తుది ప్రతిపాదనలు పంపించినా కూడా ఇంకా టీఎస్ఆర్టీసీ మీనమేషాలు లెక్కపెడుతోందని అన్నారు కృష్ణబాబు. తెలంగాణ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.
ఇంకా ఏమన్నారంటే..?
-- విజయవాడ – హైదరాబాద్ రూట్లో ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తగ్గించాలని తెలంగాణ అధికారులు కోరారు. వారి విజ్ఞప్తి మేరకు 322 బస్సులను తగ్గిస్తూ ప్రతిపాదనలు పంపించాం.
-- ఏపీ, తెలంగాణ మధ్య అంతర్ రాష్ట్ర ఒప్పందం కుదిరేలోగా రెండు రాష్ట్రాల ఆర్టీసీలు 70 వేల కి.మీ. చొప్పున బస్సులు నడుపుదామని ప్రతిపాదించినా వారు అంగీకరించలేదు.
-- 2 రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో రోజుకు రూ. 3.50 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది.