అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంటూ ఉండటంతో .. ట్రంప్‌, బైడెన్‌ హోరాహోరీగా తలపడుతున్నారు. ఈ తరుణంలో వస్తున్న కొన్ని సర్వేల్లో.. బైడెన్‌కే సానుకూలత ఉన్నట్లు తెలుస్తోంది.

అమెరికా ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో.. ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ తొలిసారి ప్రచార రంగంలోకి దిగారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని అట్‌గ్లెట్‌లో తన భర్త, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తరఫున ఆమె స్వయంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ట్రంప్‌ ఓ నిజమైన ఫైటర్‌ అని మెలానియా ప్రశంసించారు. మెలానియా.. ఇదివరకే తన భర్తతో కలసి ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ.. ఆమెకు కరోనా వైరస్‌ సోకటంతో ఆ ప్రయత్నాలు ఆలస్యమయ్యాయి. కరోనా సోకినప్పుడు తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు మెలానియా.

మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌కు యువత మద్దతు లభిస్తోందట. ఈ సారి ఎన్నికలపై యువత తెగ ఆసక్తి చూపుతున్నారని.. అత్యధికులు డెమ్రోకటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌కే జై కొట్టబోతున్నారని  హార్వర్డ్‌ యూనివర్సిటీ  సర్వేలో తేలింది. యువ ఓటర్ల ఆదరణలో రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌ కన్నా.. డెమెక్రటిక్‌ అభ్యర్థి బైడెన్‌ 24 పాయింట్ల ముందంజలో ఉన్నట్టు సర్వేలో తేలింది.

అటు నవంబర్‌ 3న జరగనున్న ఎన్నికల్లో  ట్రంప్‌ ఓడిపోయినట్లయితే.. అమెరికా ఎన్నికల చరిత్రలో ఓ రికార్డే.  దేశాధ్యక్షుడు రెండో సారి ఓడిపోవడం గత 28 ఏళ్లలో ఇదే మొదటి సారి అవుతుంది. 1992లో బిల్‌ క్లింటన్‌ చేతుల్లో నాటి అధ్యక్షుడు జార్జి హెచ్‌డబ్లూ బుష్‌ ఓడిపోయారు.  231 ఏళ్ల అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో 45 మంది దేశాధ్యక్షుల్లో.. కేవలం పది మంది మాత్రమే రెండోసారి విజయం సాధించకుండా ఓడిపోయారు. మొత్తానికి అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ప్రజలపై వరాలు కురిపిస్తూ.. ఓట్లకు గాలం వేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: