టీడీపీ లో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక్క ఉన్నత పదవి పొందకుండా ఉన్న నేత ఎవరైనా ఉన్నారంటే అయన గోరంట్ల అని చెప్పాలి.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్ళు పార్టీలో కానీ పదవుల్లో కానీ ఆయనకు గుర్తింపు లభించలేదు. ఎన్టీఆర్ జమానా లో చిన్నన్న గా గుర్తింపు పొంది ప్రణాళికామండలి ఉపాధ్యక్షుడిగా, మంత్రిగా పదవులు చేపట్టి ఆ తరువాత చంద్రబాబు హయాంలో కరివేపాకు అయిపోయిన మాజీ మంత్రి రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
ఇప్పుడు ఆయన కల ఎట్టకేలకు ఫలించింది. ఎప్పటినుంచో కోరుకుంటున్న గుర్తింపు పార్టీలో కీలకమైన పాలిట్ బ్యూరో సభ్యుడి రూపంలో దక్కింది. 1983 నుంచి రాజకీయాల్లో ఉంటూ పార్టీ నుంచి 9 సార్లు ఎమ్యెల్యే టికెట్ సాధించి ఆరు సార్లు గెలిచిన గోరంట్ల బాబు హయాంలో తనకు తగిన గుర్తింపు లభించలేదని మదన పడేవారు. ప్రస్తుతం పార్టీ క్లిష్ట సమయంలో ఆయనకు శాసన సభలో విపక్ష ఉప నేత హోదా దక్కినా పార్టీలో మరింత చురుకైన పాత్ర ను గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరుకున్నారు. ఆశించినట్లే ఆయనకు ఈసారి చంద్రబాబు తగిన విధమైన గుర్తింపు ఇచ్చారు.