ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు హైదారాబాద్‌లో భీభత్సం సృష్టించాయి. ఇళ్లు,  రోడ్లు, ఫ్లైఓవర్లు ఇలా అంతటా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. దాంతో పునర్నిర్మాణ పనులపై దృష్టి పెట్టింది తెలంగాణ  ప్రభుత్వం.

గ్రేటర్ హైదరాబాద్‌లో 9వేల13 లేన్ కిలోమీటర్ల విస్తీర్ణం గల రహదారులున్నాయి. వీటిలో 2వేల846 కిలోమీటర్లలో బీటీ రోడ్లు ఉండగా.. 6వేల167 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లున్నాయి. వర్షాలు, వరదల కారణంగా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మంత్రి కేటీఆర్ ఆదేశాలకనుగుణంగా.. గతుకుల రోడ్లకు ప్యాచ్ వర్కు పనులు షురూ అయ్యాయి.

జీహెచ్ఎంసీ పరిధిలో దెబ్బతిన్న 83 కిలోమీటర్ల రోడ్లకు ప్యాచ్ వర్కు పనులు యుద్ధ ప్రాతిపదికపై చేపడుతున్నారు. మరో 99 కిలోమీటర్ల రోడ్లకు.. 52 కోట్ల వ్యయంతో పునర్నిర్మిమించే పనులు ప్రారంభమయ్యాయి. వీటితో పాటు సమగ్ర రహదారుల అభివృద్ధి పథకం కింద..83 కిలోమీటర్ల రహదారులలో మొదటి లేయరును వేస్తున్నారు.

హుస్సేన్ సాగర్ సికింద్రాబాద్ మార్గంలో ఉన్న సర్ ప్లస్ నాలా.. అసంపూర్తిగా ఉన్న పనులను  68 కోట్లతో చేపట్టనున్నారు. రాబోయే పదిరోజులపాటు రోడ్ల పునరుద్ధరణ పనులపై సమగ్ర ప్రణాళిక రూపొందించుకొని రావాలన్నారు మంత్రి కేటీఆర్. రోజువారీ లక్ష్యాలతో పనులు చేపట్టాలని ఆదేశించారు.

గ్రేటర్‌లో 192 చెరువులను ఇంజనీర్ల బృందం తనిఖీలు చేసింది. వీటిలో కొన్ని చెరువులు పాక్షికంగా దెబ్బతినగా ఆరు చెరువులకు పూర్తిగా గండ్లు పడ్డాయి. వీటన్నిటికీ మరమ్మతులు తక్షణమే చేపట్టేందుకు జీహెచ్ఎంసీ 41 కోట్లను ప్రత్యేకంగా విడుదల చేసింది. ఇక నగరంలోని పాత ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిలను కూడా సమగ్ర తనిఖీ చేసి..వెంటనే మరమ్మతులు చేయించాలని కెటీఆర్‌ అధికారులకు సూచించారు. మొత్తానికి ఇటీవల హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు నామరూపాల్లేకుండా పోయాయి. వరదలకు కొట్టుకుపోవడంతో గుంతలు.. రాళ్లు తేలి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులను కలుగజేస్తున్నాయి. రోడ్ల దుస్థితిపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం రహదారుల మర్మమతులకు పూనుకుంది.






మరింత సమాచారం తెలుసుకోండి: