ఎపీలో కరోనా ముందు రోజూ 30 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగేవి. అయితే కరోనా సమయంలో రేట్లు పెంచి షాపులు తిరిగి తెరినప్పుడు..రేట్ల ప్రభావం తీవ్రంగా కనిపించింది. సాధారణ రోజుల్లో 30 లక్షల కేసులు అమ్ముడైన చీప్ లిక్కర్ అమ్మకాలు.. తరువాత కాలంలో 12 లక్షల కేసులకు పరిమితం అయ్యాయి. మద్యం ధరలు 75 నుంచి 100 శాతం పెరగడంతో పొరుగు రాష్ట్రం మద్యం పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి వచ్చింది. దీంతో నెలకు 18 లక్షల ఆదాయం పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయింది. ఆ తరువాత కాలంలో నిఘా పెరగడంతో చీప్ లిక్కర్ రవాణా కొంత మేర కంట్రోల్ లోకి వచ్చింది. అయితే ప్రీమియం బ్రాండ్ల రేట్లు ఎపిలో చాలా ఎక్కవగా ఉండడంతో ఆ తరహా మద్యం రవాణా మాత్రం తగ్గలేదు. ఇదే సమయంలో మూడు బాటిల్స్ తెచ్చుకోవచ్చని కోర్టు ఇచ్చిన తీర్పుతో గత రెండు నెలల్లో పెద్ద ఎత్తున పొరుగు రాష్ట్రం నుంచిమద్యం అధికారికంగా తెచ్చుకున్నారు. అయితే తాజాగా దానిపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ప్రీమియం బ్రాండ్లపైనా రేట్లు తగ్గించింది. కానీ ప్రభుత్వం తగ్గించిన రేట్ల వల్ల అనూహ్యమైన మార్పు ఉండదని ఆ వర్గాలు చెపుతున్నాయి.
ఇప్పటికీ తెలంగాణ కంటే ఏపీలో మద్యం ధరలు చాలా అధికంగా ఉన్నాయని చెపుతున్నారు. రేట్లు తగ్గించిన తరువాత కూడా ఒక్కో బాటిల్ పై గరిష్టంగా 700 వ్యత్యాసం ఉందని తెలుస్తోంది. మరోవైపు పేరుకు అన్ని బ్రాండ్ల పేర్లు చెపుతున్నా..ఏపీలోని ప్రభుత్వ వైన్ షాపుల్లో అవి లభ్యం కావడం లేదు. దీంతో స్మగ్లింగ్ కొనసాగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. రేట్లు తగ్గించడం తో పాటు..అన్ని బ్రాండ్లను అందుబాటులోకి తేస్తే మార్పు ఉంటుందని ఆయా వర్గాల వారు చెపుతున్నారు.