2016 నవంబర్ 8.. దేశప్రజలందరూ ఎవరి పనుల్లో వారున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు.. పిడుగు లాంటి వార్త... దేశాన్ని ఊపేసింది. అదే నల్లనోట్ల రద్దు.. దేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఆ ప్రసంగంలో మోడీ.. 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో అప్పటి వరకూ మార్కెట్లో ఉన్న 86 శాతం కరెన్సీ చిత్తు కాగితాలుగా మారిపోయింది. ఇది అవినీతిపై మాస్టర్ స్ట్రోకన్నారు ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు.
నోట్లు రద్దు చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ.. తనకు 50 రోజులు గడువు కావాలని కోరారు. డిసెంబర్ 30 వరకూ గడువు కావాలని.. డిసెంబర్ 30 తర్వాత, నోట్లరద్దులో తప్పు ఉందని తేలితే.. ఏ చౌరస్తాలో నిలబెట్టి శిక్ష విధించినా భరిస్తానన్నారు మోడీ. దేశప్రజలకు శరాఘాతంగా పరిణమించిన తన నిర్ణయాన్ని ఆయన నల్లధనాన్ని అరికట్టడానికి తీసుకున్న చర్యగా చెప్పుకున్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదంపై అది సర్జికల్ స్ట్రైక్ అని ప్రకటించారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ సమాజంపై వైపు ఒక పెద్ద ముందడుగు అని తెలిపారు.
ఉన్నపళాన నోట్ల రద్దుతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. దీంతో తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంకులో జమ చేసేందుకు జనం ... భారీ క్యూలు కట్టారు. ఈ క్యూలు కిలోమీటర్ల పాటు సాగాయి. మరోవైపు...500, 1000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. క్రమంగా 500, 2000 రూపాయల నోట్లను తీసుకు వచ్చింది. బ్యాంకుల్లో రద్దీ పెరుగుతుండడం, నగదు మార్పిడి కష్టంగా మారడంతో... ఏటీఎంల నుంచి నోట్లు తీసుకోవచ్చని తెలిపింది. ఏటీఎంల నుంచి కొత్త నోట్లు తీసుకునేందుకు ప్రజలు పడిన అవస్థలు అన్నీఇన్నీకాదు.
నల్లధనాన్ని అరికట్టేందుకే పెద్దనోట్లను రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే భారతీయ రిజర్వ్ బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం 99 శాతం కరెన్సీ బ్యాంకులలో జమ అయ్యింది. కొందరు పాత కరెన్సీని ఆస్తుల రూపంలోకి మార్చుకున్నారని తెలియవచ్చింది. తరువాతి కాలంలో నోట్ల కొరత ఏర్పడి జనం పలు ఇబ్బందులు పడ్డారు. మొదట్లో రెండు వేల రూపాయల నోటు మాత్రమే మార్కెట్లో చలామణీలోకి వచ్చింది. ఇదే సమయంలో రెండు వేల రూపాయల దొంగనోట్లు కూడా మార్కెట్లోకి ప్రవేశించాయి. దీంతో ప్రభుత్వం రెండు వేల రూపాయల నోటు ముద్రణను నిలిపివేసింది.