బీహార్ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ... గతంకన్నా తక్కువ స్థానాలే గెలిచింది.. అయినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అందుకు కారణం ఆ పార్టీ నేత చిరాగ్ పాశ్వన్ అనుసరించిన విధానం. ఎన్నికల ముందు వరకు ఎన్డీఏ లో భాగంగా ఉన్న చిరాగ్ పాశ్వాన్.... అసెంబ్లీ ఎలక్షన్ల కొచ్చేసరికి ఒంటరిగా పోటీకి సిద్ధపడ్డారు. ఓ వైపు బీజేపీ, మోడీపై అభిమానాన్ని ఒలక బోస్తూనే మరోవైపు జేడీయూతో సై అంటే సై అన్నారు. అలా.. పొత్తుల్లో తేడాలతో చిరాగ్ పాశ్వన్ పార్టీ ఎల్‌జేపీ 137 స్థానాల్లో తన అభ్యర్థులను నిలిపింది. అయితే గెలిచింది మాత్రం ఒక్క సీటే. అది చిరాగ్ పాశ్వన్ పోటీచేసిన స్థానమే. కాని తొమ్మిది చోట్ల రెండో స్థానంలో నిలిచింది. మొత్తంగా 5శాతం ఓట్లను సాధించి.. బిహార్ ఫలితాలను తారుమారు చేసింది.
బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్‌ను బీజేపీ పావుగా వాడింది. నితీశ్ తమ నాయకుడు అంటూనే చిరాగ్ ఒంటరి పోరాటం చేయడానికి పురికొల్పింది. అలాగే విడిగా పోటీచేసిన చిరాగ్ పాశ్వన్ .. ప్రతిచోట జేడీయూని ఊహించని దెబ్బకొట్టాడు. నితీష్‌కు వ్యతిరేకంగానే ఒంటరిగా పోటీచేస్తున్నానని ప్రకటిస్తూనే .. బీజేపీకి మాత్రం సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేశాడు. మోడీని శ్రీ రాముడిగా తనను తాను హనుమంతుడిగా అభివర్ణిస్తూ ... సాధ్యమైనంతగా ఓటర్లను కన్ఫ్యూజన్‌లో పడేశాడు .
ఒంటరి పోరాటంతో పరోక్షంగా బీజేపీకి సహకరించాడు చిరాగ్ పాశ్వన్. బీజేపీ 74 స్థానాల్లో విజయం సాధించడానికి పరోక్ష కారణమయ్యాడు. బీజేపీ ఎక్కువ సీట్లు గెలవడంలో చిరాగ్ పాత్ర కీలకమనే చెప్పాలి. తాను గెలవడని తెలిసి కూడా.. అన్ని చోట్ల పోటీచేసి .. ఓట్లను చీల్చాడు. జేడీయూ, ఆర్జేడీ గెలిచే స్థానాల్లో ఓట్లను చీల్చి.. తద్వారా బీజేపీ గెలిచేందుకు దోహదపడ్డాడు.
తండ్రి రాం విలాస్ పాశ్వన్ ఫార్ములానే ఫాలో అవుతున్నాడు చిరాగ్. ఆయన బాటలోనే నడుస్తున్నాడు. గెలిచేది తక్కువ స్థానాలే అయినా కేంద్రంలో కీలకపదవి చేపట్టే వారు రాంవిలాస్ పాశ్వాన్. రెండు మూడు ఎంపీ స్థానాలతో కేంద్రమంత్రి పదవిని దక్కించుకునే వారు. అధి ఎన్డీఏ గవర్నమెంట్ అయినా, యూపీఏ ప్రభుత్వమైనా అందులో తన స్థానాన్ని మాత్రం పదిలంగా కాపాడుకునేవారు. అలాగే చిరాగ్ పాశ్వన్ కూడా తండ్రి తరహాలోనే రాజకీయాలకు తెరతీసి బీహార్‌లో విజయవంతంగా అమలు చేసి చూపాడు.