ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ అనేక దేశాలు ఆర్థిక మాంద్యం బారిన చిక్కినా.. భారత్ వాటి బారిన పడలేదు. అయితే చరిత్రలో తొలిసారిగా ఇండియా ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటోంది. లాక్‌డౌన్ అమలు తర్వాత వరుసగా రెండో త్రైమాసికంలోనూ జీడీపీ వృద్ధిరేటు క్షీణించిందని.. దానర్థం భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుందని ఆర్‌బీఐలోని నిపుణులు అభిప్రాయపడ్డారు. కరోనాకు ముందే ఇండియన్ ఎకానమీ మీద మాంద్యం చాయలు కమ్ముకున్నాయి. లాక్‌డౌన్ తర్వాత అవి తీవ్రంగా మారాయి.
ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ 23.9 శాతం క్షీణించింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలోనూ వృద్ధిరేటు 8.6శాతం క్షీణించే అవకాశాలున్నట్లు ఆర్‌బీఐ నౌకాస్ట్ విధానంలో తొలిసారి విడుదల చేసిన అంచనాల్లో నిపుణులు ఈ మేరకు అభిప్రాయపడ్డారు. దశలవారీగా కార్యకలాపాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తే క్షీణతను అడ్డుకోవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడంతో మే, జూన్ నెలలో ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకొందని ఆర్టికల్‌లో పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ విధానాల వల్లే భారత్‌లో ఆర్థిక మాంద్యం వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. జీడీపీ అంచనాలపై వచ్చిన ఆర్బీఐలోని నిపుణులు రాసిన వార్తా కథనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చరిత్రలో తొలిసారి భారత్ ఆర్థిక మాంద్యంలోకి జారుకుంది. మోడీ చర్యలు భారత్‌ను పటిష్ఠ స్థితి నుంచి బలహీనంగా మారుస్తున్నాయని అందులో విమర్శించారు.
తొలి రెండు త్రైమాసికాలలో జీడీపీ నీరసించినప్పటికీ మూడో త్రైమాసికమైన అక్టోబర్- డిసెంబర్ నుంచి వృద్ధి బాట పట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లక్షా ఐదువేల కోట్ల రూపాయల జీఎస్‌టీ వసూళ్లు, గత నెలలో 12 శాతం పెరిగిన విద్యుత్ వినియోగం, రోజుకి 20 శాతం వృద్ధి చూపుతున్న రైల్వే సరుకు రవాణా, కొత్త రికార్డులను సాధిస్తున్న స్టాక్ మార్కెట్లు లాంటి అంశాలను ఉదాహరణగా చూపించారు. విదేశీ మారక నిల్వలు సైతం రికార్డ్ స్థాయిలో 560 బిలియన్ డాలర్లను తాకినట్లు తెలియజేశారు. 11 రోజులుగా ఎకానమీలో పటిష్ట రికవరీ ఉందన్నారామె. ఆర్థిక పురోగతికి వీలుగా ఆత్మనిర్భర్-3ను ప్రకటించారు.