జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే గా గుర్తింపు పొందిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ వ్యవహారం చాలాకాలంగా జనసేన పార్టీకి తలనొప్పిగా మారుతూ వస్తోంది. గెలిచిన కొద్ది నెలలపాటు జనసేన కు, పవన్ కు విధేయుడిగా ఉంటూ , పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నా,  ఆ తర్వాత తన అసంతృప్తిని వెళ్లగక్కారు. పార్టీలో తమకు సముచిత స్థానం ఇవ్వకుండా,  ఎన్నికల్లో ఓటమి చెందిన నాదెండ్ల మనోహర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని బహిరంగంగానే అసంతృప్తిని రాపాక వెళ్లగక్కారు. అక్కడితో ఆగకుండా, వైసీపీకి మద్దతు ప్రకటించారు . అంతేకాదు జనసేన లో ఉంటూనే,  జగన్ ఫోటో కు పాలాభిషేకం చేసి సంచలనం సృష్టించారు.




 అయితే జనసేన పార్టీ నుంచి రాపాకను సస్పెండ్ చేయకుండానే , వేచి చూసే ధోరణిలో ఉండగా, రాపాక సైతం పార్టీకి రాజీనామా చేయకుండా వైసిపి కి అనుబంధంగా కొనసాగుతూ,  జగన్ నిర్ణయాలను సమర్థిస్తూ,  ఆ పార్టీకి మద్దతు గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో పవన్ పై విమర్శలు వస్తుండడం,  గెలిచిన ఎమ్మెల్యేలు సైతం పార్టీ గీత దాటి బహిరంగంగా విమర్శలు చేస్తున్నా,  ఏమి చేయలేకపోతున్నారనే విమర్శలు ఎక్కువగా రావడం వంటి కారణాలతో పవన్ సైతం ఆయనపై ఏదో రకంగా రాజకీయ కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశ్యం లో చాలా కాలం నుంచి ఉన్నారు.



 తాజాగా రాజోలు నియోజకవర్గం సైనికులతో పవన్ సమీక్ష నిర్వహించిన సందర్భంగా,  రాపాక ప్రస్తావన రావడంతో పవన్ గట్టిగానే స్పందించారు. ఆయన పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి,  ఇకపై ఆయనను ఎవరు పట్టించుకోవద్దని, త్వరలోనే రాజోలు నియోజకవర్గంలో జనసేన కు కొత్త అభ్యర్థిని ఇన్చార్జిగా నియమిస్తామని పవన్ హామీ ఇచ్చారు. అలాగే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రాపాక నిలబెట్టిన అభ్యర్థులకు జనసైనికులు ఎవరు మద్దతు పలకవద్దని పవన్ సూచించారు. అంతేకాకుండా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాపాక కు సీటు ఇచ్చేది లేదని, ఆయన స్థానంలో మరొకరిని నియమిస్తామని పవన్ క్లారిటీ ఇచ్చారు. రాపాక ను రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే ఆయన నిలబెట్టిన స్థానిక సంస్థల అభ్యర్థులందరనీ ఓడించి , జనసేన సత్తా ఏమిటో ఆయనకు తెలిసొచ్చేలా చేయాలంటూ పవన్ పార్టీ నేతలకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: