రాజకీయాల్లో గుండె ధైర్యం అధికంగా ఉండాలి. అప్పుడే ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని, వాటిని ఖచ్చితంగా అమలు చేయగలుగుతారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఎంజీఆర్, జయలలితలు. పురచ్చితలైవి అయితే... ప్రత్యర్థులకు సింహస్వప్నం.. మేరునగదీరుడు లాంటి కరుణానిధిని సమర్ధంగా ఎదుర్కొని, సీఎం పీఠం అధిష్టించారు. ఆమెలోని ధైర్యంలో పదోవంతు కూడా రజినీకాంత్‌లో కనిపించదు. పైగా ఆయనలో ఆధ్యాత్మిక వాది .. అప్పుడప్పుడు తొంగి చూస్తుంటాడు. రాజకీయాల్లో మానవీయ కోణమనేది లేదు. అధికారమే పరమావధిగా పార్టీలు ముందుకెళ్తాయి. అలాంటిది ఆధ్యాత్మిక రాజకీయం అన్నపదం ఎలా వర్కవుట్ అవుతుందనేది రాజనీతివేత్తల సూటి ప్రశ్న.

వా.. వా.. రజినీ అంటూ అభిమానులు దశాబ్దకాలుగా పిలుస్తున్నా.. రజినీ రాజకీయాల్లోకి రావాలా వద్దా అంటూ ఆలోచనలతోనే కాలక్షేపం చేశాడు. పార్టీ పెట్టడానికే ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకున్నాడు. హేమాహేమీలతో తలపడేందుకు సాహసించలేదని.. అందుకే కరుణ, జయ ఉన్న సమయంలో... ఆదిశగా అడుగులేయలేదనే అపవాదులున్నాయి. ఇప్పుడు పురచ్చితలైవి, కరుణలు లేరు. ఈ రాజకీయ గ్యాప్‌ను పూరించాలని తలచిన రజినీ.. పార్టీ దిశగా అడుగులేస్తున్నారు. అయితే ఆయన ఈ విషయంలో పక్కాగా సిద్ధమయ్యారా అంటే చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది.

ఓవైపు దేశవ్యాప్తంగా కాషాయ జెండా రెపరెపలను చూడాలని రాజకీయ జైత్రయాత్ర చేస్తున్న బీజేపీకి .. మరో ముఖంగా రజినీకాంత్‌ను విమర్శకులు అభివర్ణిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇటీవలి కాలంలో రజినీ.. సంఘ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కొన్నిసందర్భాల్లో బీజేపీ హైకమాండ్ నేతలను పొగడడం జరిగింది. రాజకీయాల్లోకి దిగిన తర్వాత అన్ని పార్టీలతో పాటు బీజేపీపై కత్తిదూయాలి.. మరి రజినీ అంతధైర్యం చేయగలరా..? అసలు రజినీ ఒంటరిగా పోటీ చేస్తారా..? వేరేపార్టీతో పొత్తుపెట్టుకుంటారా..?

రజినీకాంత్‌ హీరోగా సూపర్ స్టార్ కావచ్చు కానీ..రాజకీయంగా మాత్రం స్పష్టత లేని వ్యక్తిగా కనిపిస్తారు. సినిమాల్లో అయితే బుల్లెట్‌కు ,బుల్లెట్ కు మధ్య హీరో పరుగుపెట్టేస్తాడు. అంతేనా బుల్లెట్లతో ఆటలాడుతాడు. వంద బుల్లెట్‌ దెబ్బలు తగిలినా లేచి నిలబడతాడు. కానీ ఇది రాజకీయం. ఇక్కడ ఏదీ అంత సులభంగా సాధ్యంకాదు. సరైన ప్రణాళిక లేకుంటే కిందపడటం ఖాయం. ఓసారి కిందపడితే రాజకీయాల్లో మళ్లీ పైకి లేవలేక చతికిల పడ్డ స్టార్ హీరోలెందరో మనకు ప్రత్యక్ష ఉదాహరణలకు కనిపిస్తూనే ఉన్నారు. మరి రజినీ పార్టీ రాజకీయంగా ఎలాంటి సంచలనాలు సృష్టించనుంది? అభిమానుల ఆకాంక్షలను నిలబెట్టుకుంటుందా.. రాజకీయ రంగాన్ని మార్చగలుగుతుందా.. వీటికి వచ్చే ఎన్నికలే సమాధానం చెబుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: