స్నేహితుల కారణంగా ఓ పెళ్లి పీటల మీద ఆగిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలి రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. కనౌజ్ జిల్లాకు చెందిన యువతికి బరేలికి చెందిన యువకుడితో కొద్ది రోజుల క్రితమే పెళ్లి నిశ్చయమైంది. ముహుర్తం ప్రకారం గత శుక్రవారం పెళ్లి జరగాల్సి ఉంది. ఇంటి ముందు మామిడి తోరణాలు.. ఇంటి నిండా చుట్టాలు.. పెళ్లి హడావిడి కొట్టొచ్చినట్టు కనిపించింది. పెళ్లి కొడుకు వచ్చి పీటల మీద కూర్చున్నాడు. పెళ్లి కూతురు కూడా వచ్చింది. తీరా ఎక్కడ్నుంచి వచ్చారో.. ఎలా వచ్చారో గానీ.. పెళ్లి మండపం దగ్గరకి వరుడు స్నేహితులు వచ్చారు. ఫ్రెండ్ పెళ్లి కావడంతో వాళ్లు ఫుల్ గా తాగి ఉన్నారు. సరాసరి పెళ్లి మండపం దగ్గరకు వెళ్లి.. పెళ్లి కూతురు చేతి పట్టుకుని ఆమెను పైకి లేపారు.

ఇక పెళ్లి కూతురు వారిస్తున్నా వినకుండా.. ఆమెను అక్కడ్నుంచి లాక్కెళ్లారు. డాన్స్ చేయాలని బలవంతపెట్టారు. తనకు డాన్స్ రాదని.. తాను చేయలేనని చెబుతున్నా వినిపించుకోలేదు. ఆమెను పెళ్లి మండపం పక్కనే ఉన్న డాన్స్ స్టేజ్ దగ్గరకు వెళ్లి.. ఆమె చుట్టూ మూగి.. డాన్స్ చేయకుంటే పెళ్లి పీటల మీదకు పంపించబోమని నానా యాగి చేశారు. దీంతో విసిగెత్తిపోయిన ఆ యువతి... ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి కొడుకు కుటుంబం, స్నేహితులతో వాగ్వాదానికి దిగారు. ఆ గొడవ చిలికి చిలికి గాలి వాన అయింది. దీంతో ఆ వధువు.. తాను ఈ పెళ్లి చేసుకోనంటే చేసుకోను అని తెగేసి చెప్పింది.

ఈ నేపథ్యంలో పెళ్లి కూతురు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముందు అనుకున్న దానికంటే ఎక్కువ కట్నం అడుగుతున్నారని వారిపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు.. వరుడి కుటుంబంపై కేసు నమోదు చేశారు. వరుడి స్నేహితులు చేసిన ఆకతాయి పనికి.. పీటల మీదకు వచ్చిన పెళ్లి పెటాకులైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: