భారత్ కరెన్సీ విలువ ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తోందా? అమెరికాకు ఇదే అనుమానం వచ్చింది. భారత్ తో పాటు మరికొన్ని దేశాలను ఈ కేటగిరీలో చేర్చింది. 2018లో ఓ సారి ఈ జాబితాలో చేర్చినా మళ్లీ తొలగించింది.

కరెన్సీ మానిప్యులేషన్ విషయంలో అగ్రరాజ్యం అమెరికాకు భారత్ పై అనుమానం పుట్టుకొచ్చింది. కరెన్సీ విలువలో ఉద్దేశపూర్వకంగా మార్పిడికి పాల్పడతాయనే అనుమానం ఉన్న దేశాలను అమెరికా తన పరిశీలనల జాబితాలో ఉంచుతుంటుంది. తాజాగా ఆ జాబితాలోకి భారత్‌ తో పాటు తైవాన్, థాయ్‌ లాండ్‌ లను కూడా చేర్చింది. అంతేగాక వియత్నాం, స్విట్జర్లాండ్లను కరెన్సీ విలువను ఉద్దేశపూర్వకంగా మార్చే దేశాలుగా యూఎస్ ప్రకటించింది. ఈ జాబితాలో చైనా, జపాన్, దక్షిణకొరియా, జర్మనీ, ఇటలీ, సింగపూర్, మలేషియాలు కూడా ఉన్నాయి. ఐర్లాండ్ ను ఈ జాబితా నుంచి తొలగించినట్లు అమెరికా ఆర్థికశాఖ ప్రకటించింది.

అమెరికాతో ప్రధాన వాణిజ్య భాగస్వామ్యం కలిగి ఉన్న దేశాల్లో కరెన్సీ అవకతవకలపై దృష్టిపెట్టిన అగ్రరాజ్యం..దేశ ఆర్థిక వ్యవస్థ సంరక్షణ, అమెరికా కార్మికులు, వ్యాపారాలకు అవకాశాలు కల్పించే దిశగా కీలక చర్యలు చేపట్టామని అమెరికా ఆర్థికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నేపధ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్‌ ను ఈ జాబితాలో చేర్చడం ఇది రెండోసారి.  2018 మే నెలలో యూఎస్ తొలిసారిగా భారత్‌ ను పరిశీలన జాబితాలో చేర్చింది. గతేడాది ఈ జాబితా నుంచి తొలగించింది. విదేశీ క్రయవిక్రయాల ప్రకటనలో భారత్ సుదీర్ఘకాలంగా చూపిస్తున్న పారదర్శకతను అమెరికా ఆర్థికశాఖ స్వాగతించింది. కానీ, మళ్లీ అనుమానిత దేశాల కేటగిరీలో చేర్చింది.

సాధారణంగా చాలా దేశాలు తమ ఎగుమతులు పెంచుకోవడానికి కరెన్సీ విలువను తగ్గిస్తుంటాయి. ఇందు కోసం అవి రకరకాల విధానాలను అనుసరిస్తాయి. ఫలితంగా ఆయా దేశాల్లో వస్తువులు చౌకగా లభిస్తుంటాయి. దీంతో ఇది ఇతర దేశాల వ్యాపారాలకు గండికొడుతుంటుంది. అమ్మో అసలు కథ ఇదా అని పలువురు చెవులుకొరుక్కుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: