హైదరాబాద్‌ నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌కి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ ను సొంతం చేసుకుంది. ఇండియాలోనే ఈ ఘనత చేజిక్కించుకున్న ఏకైక జూపార్క్‌గా రికార్డు సాధించింది. జంతుసంరక్షణతోపాటు... జీవవైవిద్యాన్ని కాపాడుతున్న నెహ్రూ జూపార్క్‌ ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ పొందింది.

హైదరాబాద్‌ నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌.. అంతర్జాతీయ స్థాయిలో నిలిచింది. ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ పొంది ఇండియాలో ఈ ఘనత సాధించిన ఏకైక జూపార్క్‌గా రికార్డ్‌ సాధించింది. యానిమల్ కేర్‌, బ్రీడింగ్‌, జూ హాస్పిటల్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, శానిటేషన్‌, హైజీన్‌ మెయింటెనెన్స్‌.. ఇలా అన్ని విభాగాల్లో మూడేళ్ల పాటు నిపుణుల బృందం తనిఖీ చేసింది.

జూ సిబ్బంది సమర్థవంతంగా అంకితభావంతో పనిచేయడమే కాకుండా జంతువుల పట్ల మానవతా దృక్ఫథంతో ఉన్నట్లుగా తనిఖీ బృందం గుర్తించింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటించడమే కాకుండా... జంతురక్షణతోపాటు జీవవైవిద్యానికి కూడా పెద్దపీట వేస్తున్నట్లు గుర్తించారు.  

ఓ చూపు చూశాయంటేనే హడలెత్తాల్సిందే... అవి గాండ్రిస్తే ఒళ్లు జలధరించాల్సిందే ! వాటిని దగ్గరనుంచి చూస్తేనే ప్రాణం పోయినంత పనవుతుంది. కానీ.. అవి మా సొంత బిడ్డల్లాంటివి అంటున్నారు యానిమల్‌ కీపర్స్‌. కంటికి రెప్పలా.. తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటున్నారు. జూపార్క్‌ కి ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ రావడంలో వీరి సేవలే కీలకం. ఏకంగా 18 పెద్ద పులులను ఆప్యాయంగా చూసుకుంటున్నారు.

జూపార్క్‌లోని టైగర్స్‌కి ముచ్చటైన పేర్లు కూడా పెట్టారు సిబ్బంది. ఓ టైగర్‌ జంటకి ఏకంగా బాలీవుడ్ జోడీ సైఫ్‌, కరీనా అని పేరు పెట్టారు. మరో పెద్దపులికి ప్రభాస్‌ అని, మరో అడ పెద్దపులికి ఆశ అని.. వాటి పిల్లలకు  సూర్య, సంకల్ప్‌, శంకర్‌ అని పేరు పెట్టారు. ఇటీవలే పుట్టిన ఓ పిల్ల పులికి కల్నల్‌ సంతోష్‌బాబు గుర్తుగా సంతోష్‌ అనే పేరు పెట్టారు. ఆడ తెల్ల పులికి సమీరా అని పేర్లు పెట్టారు. ఎండాకాలం కూలర్స్‌తో, చలికాలం హీటరర్స్‌తో... కాలనికి తగ్గట్టుగా వాటిని కంటికిరెప్పలా కాపాడుతున్నారు. ఎలాంటి అనారోగ్యానికి గురవకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు డాక్టర్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: