ఒకడుగు ముందుకు.. ఒకడుగు వెనక్కి... ఎటూ తేలకుండా.. ఏదో జరుగుతోందనే రీతిలో సాగుతున్నాయి భారత్- చైనా చర్చలు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తొలగించి ప్రశాంత పరిస్థితి తీసుకురావాలని రెండు దేశాలు చర్చల ప్రక్రియ ప్రారంభించాయి. 11 వారాల తర్వాత రెండు దేశాలు మళ్లీ చర్చలు ప్రారంభించాయి. వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆన్ బోర్డర్ అఫైర్స్ కింద రెండు దేశాల రాయబారులు వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు.
కొన్ని నెలలుగా గడ్డ కట్టించే చలిలో వేల సంఖ్యలో మోహరించిన సైన్యాన్ని ఉపసంహరించుకునే దిశగా రెండు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. చివరిసారి ఈ సమావేశం సెప్టెంబర్ 30న జరిగింది. అయితే బలగాల ఉపసంహరణకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరలేదు. దీంతో శుక్రవారం మరోసారి ఈ బలగాల ఉపసంహరణే ప్రధాన ఎజెండాగా చర్చలు ప్రారంభించినట్లు చైనా ప్రకటించింది. సెప్టెంబర్ 30 నుంచి ఇప్పటి వరకూ రెండుసార్లు మిలిటరీ స్థాయి చర్చలు జరిగినా.. అవి విఫలమయ్యాయి.
భారీగా మోహరించిన సైనిక బలగాలను సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నాలను కొనసాగించాలని భారత్, చైనాలు నిర్ణయించాయి. ప్రస్తుత చర్చల్లో సానుకూల ఫలితాలు వచ్చినా రాకున్నా.. రానున్న రోజుల్లో ఉద్రిక్తతల సడలింపుకు దౌత్య, సైనిక స్థాయిలో సంప్రదింపులను కొనసాగించాలని నిర్ణయించారు. సైనిక, దౌత్య మార్గాల్లో కమ్యూనికేషన్‌ను కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను మరింతగా తగ్గించేందుకు, బలగాల ఉపసంహరణకు గట్టి చర్యలు తీసుకునే అంశంపై లోతైన చర్చలు జరిపినట్లు వివరించింది.
మొత్తానికి భారత్-చైనా సరిహద్దుల్లో చర్చలు ఉత్కంఠగానే సాగుతున్నాయి. కానీ ఫైనల్ గా ఏమీ తేల్చలేకపోతున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నా అవి సఫలీకృతం కాలేదు. ఇంకేముందీ చర్చలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.