తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో బీజేపీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. రాష్ట్రంలో ఎదిగేందుకు, అధికారంలోకి వ‌చ్చేందుకు ఈ స్థానంలో గెలుపును గేట్ వేగా బీజేపీ నాయ‌కులు పేర్కొంటున్నారు. నిజానికి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ-జ‌న‌సేన‌తొ పొత్తు పెట్టుకుంది. ఈ క్ర‌మంలో ఈ టికెట్ విష‌యంలో రెండు పార్టీల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేకుండాపోయింది. మాకంటే మాకే కావాలంటూ.. రెండు పార్టీలూ ప‌ట్టుబ‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో దీనిని తేల్చేందుకు క‌మిటీ వేసుకుందామ‌ని ఇరు పార్టీలు నిర్ణ‌యించాయి. అయితే.. దీనికి భిన్నంగా బీజేపీ మాత్రం అభ్య‌‌ర్థుల వేట సాగిస్తోంది. ఇప్ప‌టికే ఇక్క‌డ నుంచి జ‌న‌సేన మ‌ద్ద‌తుతో బీజేపీ అభ్య‌ర్థి పోటీ చేస్తారంటూ.. సోము వీర్రాజే ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

స‌రే.. ఈ వివాదాన్ని ప‌క్క‌న పెడితే.. బీజేపీ త‌ర‌ఫున రంగంలోకి దిగేందుకు న‌లుగురు రెడీగా ఉన్నార‌ని ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. వీరిలో మాజీ మంత్రి, అతిత‌క్కువ కాలంలో ముచ్చ‌ట‌గా మూడు పార్టీలు మారిన రావెల కిశోర్‌బాబు, తెలంగాణ‌కు చెందిన మాజీ మంత్రి, తొలుత టీడీపీ, త‌ర్వాత టీఆర్ ఎస్ ఇప్పుడు బీజేపీలో ఉన్న బాబూ మోహ‌న్ పోటీ ప‌డుతున్నారు. అయితే.. వీరికి ఛాన్స్ చిక్కే ప‌రిస్థితి లేద‌ని పార్టీ వ‌ర్గాలే చ‌ర్చించుకుంటున్నాయి. ఎందుకంటే.. ఇద్ద‌రూ కూడా నిల‌క‌డ‌లేని నాయ‌కులే.. పైగా వీరు ఎప్పుడు ఎలా మార‌తారో తెలియ‌ని ప‌రిస్తితి. మ‌రీ ముఖ్యంగా బాబూ మోహ‌న్ స్థానికుడు కూడా కాదు. సో.. మొత్తానికి ఈ ఇద్ద‌రూ ఔట్‌. అయితే.. మ‌రో వైపు గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన బొమ్మి శ్రీహ‌రి రావు కూడా మ‌రో సారి టికెట్ ఇస్తే.. బాగుండున‌ని కోరుకుంటున్నారు. కానీ, ఆయ‌నకు ఇచ్చే ఉద్దేశం కూడా లేదు.

ఈ నేప‌థ్యంలో ఎవ‌రు టికెట్ ద‌క్కించుకుంటార‌నే ఆస‌క్తి నెల‌కొంది. మ‌రో వైపు సీనియ‌ర్లు.. దూకుడుగా అభ్య‌ర్థి కోసం వేట సాగిస్తున్నారు. పార్టీ కోసం ఎప్ప‌టి నుంచో క‌మిట్‌మెంట్‌తో ఉన్న నాయ‌కుడినే ఈ ఉప ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దించాల‌ని బీజేపీ చూస్తోంది. మ‌రో వైపు ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర‌మైన తిరుప‌తి లోక్‌స‌భ సీటు కావ‌డంతో ఆర్ఎస్ఎస్ కూడా కొంద‌రు అభ్య‌ర్థుల పేర్లు సూచిస్తోంద‌ని తెలుస్తోంది. అయితే.. ఎవ‌రు ఇక్క‌డ నుంచి పోటీ చేసినా.. బీజేపీ గెలుపు గుర్రం ఎక్కుతుందా ? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎందుకంటే.. పొత్తుతో ఉన్న‌ప్పుడు కూడా ఒక్క‌సారి మాత్ర‌మే బీజేపీ ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కింది‌.. అది కూడా 1999లో మాత్ర‌మే.

ఇక‌, ఒంట‌రిగా బ‌రిలో దిగి గెలిచిన సంద‌ర్భం ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా లేదు. 2009, 2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసిన బీజేపీకి ఇక్క‌డ డిపాజిట్లు కూడా రాలేదు. 2014లో మ‌రోసారి టీడీపీతో పొత్తు పెట్టుకుని బ‌రిలో నిలిచినా.. బీజేపీ గ‌ట్టి ఫైట్ ఇచ్చి ఓడిపోయింది. ఈ క్ర‌మంలో.. ఇప్పుడు జ‌న‌సేన‌తో పొత్తుతో బ‌రిలోకి దిగుతుందా ?  లేక టికెట్ కోసం ప‌ట్టుబ‌డుతున్నా రెండు ప‌క్షాల మ‌ధ్య పొత్తు బెడిసి కొడితే.. ఎవ‌రికి వారు బ‌రిలొ నిలిస్తే.. ప‌రిస్థితి ఏంటి?  వంటి అనేక ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. అయినా స‌రే.. మా దారి మాదే అంటూ.. బీజేపీ నేత‌లు అభ్య‌ర్థుల వేట‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం.  

మరింత సమాచారం తెలుసుకోండి: